TS: తెలంగాణకు కళంకంగా కాళేశ్వరం

TS: తెలంగాణకు కళంకంగా కాళేశ్వరం
శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం... అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కాదని...కళంకంగా మిగిలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రంలో జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం ఆర్థికభారమని నిపుణుల కమిటీ సూచించినా తుమ్మిడిహట్టి వద్ద కాదని ప్రాజెక్టుల పేరుతో దోచుకునేందుకే మామ, అల్లుళ్లు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఇకనైనైనా తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలన్నారు. వాడీవేడిగా సాగిన చర్చలో మాట్లాడిన హరీశ్‌...సర్కారు శ్వేతపత్రం తప్పుల తడకని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురద జల్లేందుకే శ్వేతపత్రం పెట్టారని ఆరోపించారు.


ప్రభుత్వం నీటిపారుదల రంగంపై శాసనసభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చర్చను ప్రారంభించిన ఉత్తమ్‌...నీటి పారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సవాళ్లతో పాటు వివిధ ప్రాజెక్టుల అమలు, పురోగతి, వాటి నీటిపారుదల సామర్థ్యంతో పాటు రైతుల ఆదాయం పెంచే దిశగా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భారాస సర్కారు సాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఖర్చు పెట్టినా... వాటివల్ల ప్రయోజనం లేకుండా పోయిందని...ఖజానాకు తీవ్రభారం పడిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత నీటిపారుదల రంగంలో ఇంతపెద్ద అవినీతి ఎప్పుడూ జరగలేదన్న ఆయన....అందుకే వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని విమర్శించారు. డిజైన్‌, నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి...వందేళ్ల ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోయిందని పేర్కొన్నారు. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్‌లో లీకులు భారీగా ప్రారంభమయ్యాయన్న ఆయన.. ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌, కాగ్‌ రిపోర్టుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


గత ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతోనే సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టింది వైట్‌ పేపర్‌ కాదు.. ఫాల్స్‌ పేపర్‌ అన్న హరీశ్‌రావు...ప్రాజెక్టుల ద్వారా కొత్త ఆయకట్టు కల్పించామని, పాత ఆయకట్టు స్థిరీకరణ చేశామని చెప్పారు. ఇందుకు పండిన పంటలే నిదర్శమని పేర్కొన్నారు. జలయజ్ఞం కింద పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్న హరీశ్‌రావు...నాటి కాంగ్రెస్‌ సర్కారు ప్రాణహిత-చేవెళ్లకు 8ఏళ్లలో ఒక్క అనుమతి కూడా తీసుకురాకుండా...మొబిలైజేషన్ , సర్వేల పేరుతో వ్యయం చేశారంటూ తప్పుబట్టారు. హరీశ్‌ వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగిన ఉపముఖ్యమంత్రి భట్టి...కేవలం 28 వేల కోట్లతో అయిపోయే.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించకుండా... కాళేశ్వరం పేరిట లక్షా 47 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ముమ్మాటికి గుదిబండేనన్న భట్టి...జరిగిన తప్పిదాల్ని ఒప్పుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయినిగా కాకుండా కళంకంగా మారిందన్న సీఎం...వాస్తవాలను దాచి దోచుకోవాలని చూశారని అన్నారు. మేడిగడ్డ వద్ద కాకుండా తుమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు కట్టాలని నిపుణులైన ఇంజినీర్ల కమిటీ నివేదిక ఇచ్చినా... కేసీఆర్‌, హరీశ్‌రావు కుట్రపూరితంగా ఆ నివేదికను తొక్కిపెట్టారని పేర్కొన్నారు. కేసీఆర్‌, హరీశ్‌రావు తెలంగాణకు ఎంత ద్రోహం చేశారో నివేదిక ద్వారా తెలుస్తుందన్న సీఎం..తప్పును అంగీకరించకుండా..బుకాయించడం ఏంటని మండిపడ్డారు. విపరీతంగా అప్పులు చేసి పదేళ్లలో తెలంగాణను దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story