Hyderabad Cricket : హైదరాబాద్‌లో క్రికెట్ ఫీవర్....

Hyderabad Cricket : హైదరాబాద్ నగరమంతా క్రికెట్ సందడి నెలకొంది. భారత్- ఆస్ట్రేలియా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ను వీక్షించేందుకు...అభిమానులు ఉప్పల్ స్టేడియంకు భారీగా తరలివస్తున్నారు. అభిమానుల రాకతో గ్రౌండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా... చెరో మ్యాచ్ గెలిచిన ఇండియా, ఆసీస్...మూడో మ్యాచ్‌లో అమీతుమీకి సై అంటే సై అంటున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
అటు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో స్టేడియం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా స్టేడియం వద్ద 1800 పోలీసు బలగాలను మోహరించారు. ప్రతి గేటు వద్ద పకడ్బందీగా తనిఖీలు చేసి క్రికెట్ అభిమానులను లోపలికి పంపించనున్నారు. అభిమానులు ఇతర వస్తువులను లోపలికి తీసుకెళ్లకుండా నిబంధన విధించారు. అభిమానులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు.
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం కేటాయించారు. క్రికెట్ అభిమానులు ప్రజారవాణానే విస్తృతంగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లే రహదారులపై భారీ వాహనాలను అనుమతించమని స్పష్టం చేశారు. మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక సర్వీసులు నడపనుంది. స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంటవరకు ప్రత్యేక రైళ్లు నడపనుంది. అుట ఆర్టీసీ ఉప్పల్ స్టేడియం నుంచి వివిధ ప్రాంతాలకు 50 బస్సులను తిప్పనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com