TS: అమ్మో...250 కోట్ల ఆస్తులా..?

అక్రమాస్తుల కేసులో HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. నిందితుడ్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా మరో 14 రోజులు రిమాండ్‌ను పొడిగించింది. 8 రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు, బయటపడుతున్న ఆస్తులు... వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాలని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన 'రెరా' మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ కస్టడీలో బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కోట్ల నగదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వందల ఎకరాల్లో భూములు, ఖరీదైన విల్లాలు, బంగారం ఇలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్టా తవ్వే కొద్దీ బయటపడుతోంది. 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ACB అధికారులు అనేక కీలక విషయాలు రాబట్టారు.
బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నట్టు తేలింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు , నాగర్‌కర్నూల్ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములను గుర్తించారు. అతని పేరిట మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉండగా APలోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం శివబాలకృష్ణ నివాసముంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌లో 4, రంగారెడ్డిజిల్లాలో 3 బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు అతని సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కస్టడీ ముగిసిన తర్వాత ఉస్మానియాలో వైద్య పరీక్షలకు తరలించారు. బుధవారంతో శివబాలకృష్ణ రిమాండ్ ముగియడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి తర్వాత చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు శివబాలకృష్ణ వల్ల నష్టపోయిన నలుగురు వ్యక్తులు ACB అధికారులను ఆశ్రయించారు. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం HMDA కార్యాలయాల్లో సోదాలు చేసిన ఏసీబీ పలు దస్త్రాలను స్వాధీనం సైతం చేసుకుంది. శివబాలకృష్ణ కస్టడీ విచారణలో భాగంగా అతని బంధువులను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. వారి నుంచి సేకరించిన సమాచారంతో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com