HOSTLES: మూసివేత దిశగా హైదరాబాద్ హాస్టళ్లు !

హైదరాబాద్‌లోని పీజీ హాస్టళ్లు, మెస్‌లలోనూ వంటకు 90 శాతానికి పైగా గ్యాస్‌నే వినియోగిస్తున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో మెనూలో మార్పులు చేశారు. ఎక్కువసేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబారు, పప్పు, రసం వంటివాటికే పరిమితం చేస్తున్నారు. రెండు, మూడురోజుల తర్వాత వీటిని పూర్తిగా నిలిపివేసి హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని హాస్టల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
హాస్టల్ కష్టాలు
హైదరాబాద్‌లో ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్ సహా పలుప్రాంతాల్లో హాస్టళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఉండే విద్యార్థులు, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులపై తీవ్రప్రభావం పడుతుంది. గ్యాస్ కొరత, నిత్యావసరాల ధరలు పెరగడంతో హోటళ్లు ధరలు పెంచాయి. రవాణా ఛార్జీల భారం పడుతుండటంతో అల్పాహారాలపై 10 శాతం ధరలను పెంచేశారు. దోస, పూరీ, వడలపై కనీసం రూ.15 వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మాలాంటి వాటిపై రూ.10 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో 15 శాతం ధరలు పెంచారు. తాము 22 ఏళ్లుగా హోటల్ నడుపుతున్నామని మూడు రోజులుగా వాణిజ్య సిలిండర్లు లభించడం లేదని ఉప్పల్‌కు చెందిన కె.నారాయణ అన్నారు. దీంతో హోటల్‌ను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే హాస్టళ్లు మూత పడుతాయని అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతుందన్నారు.
దేశానికి అవసరమైన ఎల్పీజీ సరఫరాలో దాదాపు 62 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతుంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు ప్రభావితమయ్యాయి. దీంతో భారత్‌కు గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. అదేవిధంగా సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి కూడా సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా కమర్షియల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ రంగాలకు ఎల్పీజీ సరఫరాను తగ్గించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన చేయకపోయినా గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలకు సూచించినట్లు తెలుస్తోంది. గృహ వినియోగదారుల అవసరాలను ముందుగా తీర్చాలని కేంద్రం సూచించినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
