KCR : కేసీఆర్ ఢిల్లీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది..?

KCR : కేసీఆర్ ఢిల్లీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది..?
KCR : అనుకున్న ముహూర్తానికి కేసీఆర్.. కొత్త జాతీయ పార్టీని ప్రకటించారు

KCR BRS : టీఆర్ఎస్.. బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందింది. చెప్పిన టైమ్‌కు.. అనుకున్న ముహూర్తానికి కేసీఆర్.. కొత్త జాతీయ పార్టీని ప్రకటించారు. నాడు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అవతరిస్తే.. నేడు దేశం కోసం భారత రాష్ట్ర సమితిగా మార్పు చేశారు. ఇకపై ఢిల్లీ వేదికగా ఎజెండా రూపొందించేందుకు హస్తినలో ఇప్పటికే పార్టీ కార్యాలయం కూడా సిద్ధమైంది. అయితే భారతీయులు బీఆర్ఎస్‌ను ఆదరిస్తారా? ఎర్రకోటపై కేసీఆర్ జెండా ఎగురవేస్తారా? రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న గులాబీ బాస్.. నేషనల్ పాలిటిక్స్‌లో ఎంతవరకు సక్సెస్ అవుతారు? బీఆర్ఎస్‌తో కేసీఆర్ ఢిల్లీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఇతర రాష్ట్రాలు బీఆర్ఎస్‌ను ఆదరిస్తాయా? కేసీఆర్ ఉన్న బలాబలాలేంటి? ధీమా ఏంటి? బీఆర్ఎస్‌తో కేసీఆర్.. జాతీయంగా బలంగా ఉన్న మోదీ నాయకత్వంలోని బీజేపీ, కాంగ్రెస్‌ను ఢీ కొట్టడం సాధ్యమేనా? అసలు కేసీఆర్ ఢిల్లీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? అనేది చర్చనీయాంశంగా మారాయి.

ఇక కేసీఆర్ ఆహ్వానం మేరకు దేశవ్యాప్తంగా 40 మంది ప్రముఖులు హైదరాబాద్‌ వచ్చారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు వివిధ పార్టీలు నాయకులు.. రైతు, ప్రజా సంఘాల నేతలు వచ్చి బీఆర్ఎస్‌ను స్వాగతిస్తూ తమ ఆమోదాన్ని తెలిపారు. అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారాలంటే ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. దీనికి కూడా కేసీఆర్ సర్వం సిద్ధం చేశారు. టీఆర్‌ఎస్‌ పేరు మార్పు అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారు గులాబీ నేతలు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాశారు.

టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చామని, ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలోనూ మార్పులు చేశామని కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో వివరించారు. పార్టీ నేతలు చేసిన తీర్మానం, ఇతర పత్రాలను రేపు కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా వెళ్లి సమర్పించబోతున్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, తెలంగాణ భవన్‌ కార్యాలయ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌రెడ్డి తీర్మానం కాపీతో ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ జనరల్‌ బాడీ మీటింగ్‌లో ఆమోదించిన తీర్మానానికి ఆమోదం తెలపాలని కోరుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి వినోద్‌కుమార్ అఫిడవిట్‌ ఇస్తారు. టీఆర్‌ఎస్‌ నేతలు సమర్పించే అఫిడవిట్, ఇతర డాక్యుమెంట్లను పరిశీలించి నోటిఫికేషన్‌ ఇవ్వనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పార్టీ పేరుపై అభ్యంతరాలుంటే తెలిపేందుకు నెల రోజుల గడువు ఇస్తుంది. ఈ నెల రోజుల్లో అభ్యంతరాలేం రాకపోతే బీఆర్‌ఎస్‌ పేరుకు ఈసీ ఆమోదం తెలపనుంది. ఈసీ ఆమోదముద్ర వేసిన తర్వాత బీఆర్ఎస్‌ యాక్షన్ ప్లాన్ షురూ కానుంది.

అయితే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ.. గతంలో 2 సీట్లకే పరిమితమైంది. ఎన్టీఆర్, జయలలితకు దేశవ్యాప్తంగా విశేష అభిమానులున్నా.. సీట్లు మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఆదరిస్తాయా? ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న లోకల్‌గా ఉన్న పార్టీలను కాదని కేసీఆర్‌ వైపు మొగ్గుచూపుతారా? కేసీఆర్‌తో సన్నిహితం కారణంగా ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్‌ను స్వాగతించి ఉండవచ్చు. కానీ ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఎంత వరకు బీఆర్ఎస్‌ను జై కొడతారు? బీఆర్ఎస్ మొదటి కార్యక్షేత్రం కర్ణాటక, మహారాష్ట్ర అని కేసీఆర్ అన్నారు.

మరి మిగిలిన రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పొలిటికల్ కార్యాచరణ ఎలా ఉంటుంది? కర్ణాటక, మహారాష్ట్రనే తీసుకుంటే.. ఈ రెండు రాష్ట్రాల్లోను బలమైన ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ బలంగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలో ఉంది. కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు బలంగా ఉన్నాయి.

ఇక బెంగాల్, కేరళ, త్రిపుర, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో బలంగా ఉన్న వామపక్ష పార్టీలు గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా ప్రయత్నించి విఫలమయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీలో సత్తా చాటినా జాతీయ పార్టీ హోదాకు దగ్గర అవుతున్నా ఎంపీ సీట్లలో గెలవలేకపోయింది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీఎంసీని విస్తరించాలని.. యాంటీ మోదీ నినాదం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. ఇటీవల జరిగిన గోవా, పంజాబ్ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు.

ఇక దేశ రాజకీయాల్లో నవీన్ పట్నాయక్, ములాయం సింగ్ యాదవ్ వంటి సీనియర్ నేతలున్నా వారి పార్టీలను జాతీయ పార్టీగా చేసే సాహసమే చేయలేదు. యూపీలో బలంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీులు కూడా జాతీయ పార్టీగా మారలేదు. మరి.. భారతీయులు బీఆర్ఎస్‌ను ఆదరిస్తారా? జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఎలా అవుతుంది? అనేది ఆసక్తి రేపుతోంది

Tags

Read MoreRead Less
Next Story