MODI: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధం

MODI: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ది  ఫెవికాల్‌ బంధం
వేములవాడ, వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం.... కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన మోదీ

అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ప్రధాని మోదీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ, వరంగల్‌ జనసభలకు హాజరైన ప్రధాని... రాజన్న, భద్రకాళి సాక్షిగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాని మించి R.R టాక్స్‌ రికార్డు సృష్టిస్తుందన్న ప్రధాని... దేశవ్యాప్తంగా ఈ టాక్స్‌ గురించే చర్చ నడుస్తుందన్నారు. రైతు రుణ మాఫి చేస్తానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌... ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మాదిగల సంక్షేమం కోసం తాను ఇచ్చిన హామీని నెరవేరుస్తానని ప్రధాని స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి రాష్ట్రానికి వచ్చిన మోదీ వేములవాడ జనసభకు హాజరయ్యారు. మంగళవారం రాత్రి రాజ్‌భవన్‌లో బసచేసిన మోదీ ఉదయం అక్కడి నుంచి వేములవాడ వెళ్లారు. నేరుగా శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాని మోదీకి అర్చకులు తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం ఇచ్చారు.


రాజన్న దర్శనం అనంతరం... కరీంనగర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో ఏర్పాటు చేసిన జనసభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. R.R ట్యాక్స్‌ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్న ప్రధాని... ట్రిపుల్‌ ఆర్‌ సినిమా కన్నా R.R ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయని ఎద్దేవా చేశారు. "ఇటీవల తెలంగాణ నుంచి దిల్లీ వరకు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ గురించి చాలా చర్చ జరుగుతోంది. దీనికి ముందు తెలుగులో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం వచ్చింది. అయితే ట్రిపుల్‌ ఆర్‌ వసూళ్లను డబుల్‌ ఆర్‌ వెనక్కి నెట్టేసిందని చాలా మంది నాకు చెప్పారు. ఇంతలా వీళ్లు లూటీ చేస్తున్నారు. ఈ డబుల్‌ ఆర్‌ లో ఒకరు తెలంగాణలో లూటీ చేసి దిల్లీలోని మరో ఆర్‌కు ఇస్తారు. ఈ డబుల్‌ ఆర్‌ ఆటలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి" అని ప్రధాని అన్నారు.

అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమని ప్రధాని ఆరోపించారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారని... తెరవెనుక మాత్రం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌... అవినీతి సిండికేట్‌గా మారుతారన్నారు. “ ఈ అవినీతి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను జోడించే ఫెవికాల్‌ వంటిది. ఈ రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటాయి. కానీ అవి అవినీతి సిండికేట్‌లో భాగం. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ వాళ్లపై ఓటుకు నోటు కేసులో దర్యాప్తు చేపట్టలేదు. కాంగ్రెస్‌ విపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం కుంభకోణంపై ఆరోపణలు చేసేవారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకా కాళేశ్వరం కుంభకోణంపై ఇప్పటి వరకు ఎలాంటి విచారణకు ఆదేశించలేదు.” అని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌ ఎన్ని స్థానాల్లో గెలిచిందో మైక్రోస్కోప్‌తో వెతికినా కనిపించదని వరంగల్‌ సభలో మోదీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మోదీ ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేస్తామన్న ప్రధాని... తాను ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతానని స్పష్టం చేశారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో M.I.Mకు సత్సంబంధాలు ఉన్నాయని విమర్శించిన ప్రధాని... హైదరాబాద్‌ను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎంఐఎంకు లీజుకు ఇచ్చిందన్నారు. M.I.Mను గెలిపించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కృషిచేస్తున్నాయని ఆరోపించారు.

Tags

Next Story