MEDARAM: మేడారానికి పోటెత్తుతున్న భక్తులు

MEDARAM: మేడారానికి పోటెత్తుతున్న భక్తులు
జాతరకు ముందే భక్త జనసందోహం.... తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్న భక్తులు...

మేడారం జాతరకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. వన దేవతలు సమ్మక్క, సారలమ్మ ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మల జాతర ఈ నెల 21న ప్రారంభం కానుంది. జాతర ప్రారంభానికి ముందు నుంచే జనం వనంబాట పడుతున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు విడిది చేసే మేడారం, ఊరట్టం, చిలుకల గుట్ట, రెడ్డిగూడెం, శివరాంసాగర్ చెరువు, నార్లాపూర్, కొత్తూరు, RTC బస్టాండ్, తదితర ప్రాంతాల్లో స్నానాలకు ట్యాప్‌లను నిర్మించారు. పైపులైన్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.


అక్కడ నీటిని పట్టుకునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర సమయంలో నిరంతరంగా శుద్ధిచేసిన జలం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతరకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాగునీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాట్లు కీలకం. వీటి నిర్వహణ కోసం 13 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. కొత్తగా 43 బోరుబావులను కూడా తవ్వించారు. అలాగే నల్లాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రత్యేకంగా 100 ట్యాంకర్లతో నీటిని పంపిణీ చేయనున్నారు. జాతర పరిసరాల్లో 5 వేల 730 తాత్కాలిక, మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. 279 ప్రాంతాల్లో ఒక్కోచోట 20 చొప్పున మరుగుదొడ్లు నిర్మించి అందుబాటులోకి తేనున్నారు. వీటి నిర్వహణ బాధ్యత పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించనున్నారు. ఈనెల 15లోగా పనులు పూర్తిచేసి అన్ని సౌకర్యాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారుల చెబుతున్నారు. తాగునీటికి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story