CONGRESS: కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధం

CONGRESS: కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధం
రేపు కాంగ్రెస్‌లోకి కె. కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌.... హస్తం గూటికి బీజేపీ ఎమ్మెల్యేలు!

లోక్‌సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్‌లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌ K.కేశవరావు, ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ రేపు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. బీజేపీలో అసంతృప్తితో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారని వారితో చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీకి చెందిన కొందరు నాయకులు చేసిన ప్రకటనలు ఆ పార్టీని కలవరపాటుకు గురి చేశాయి. తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరన్న సీఎం రేవంత్‌రెడ్డి అలాంటి కుట్రల్ని ఛేదిస్తామని స్పష్టంచేశారు. సర్కార్‌ను కాపాడుకోవడం సహా పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం చేరికలకు గేట్లు తెరిచింది. బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన నాయకుల్ని వరసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ చేవెళ్ల సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి హస్తం గుర్తుపై లోక్‌సభ బరిలో నిలిచారు.


గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి వచ్చిన వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డికి మల్కాజిగిరి టికెట్‌ లభించింది. ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ టికెట్‌ దక్కించుకున్నారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ హస్తం గూటికి చేరారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకుని.. పదవి దక్కించుకున్నారు. బీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూడా గులాబీ పార్టీకి షాక్‌ ఇచ్చారు. ఆయన తన కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మితో కలిసి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. తాను సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేశానని జీవిత చరమాంకంలో తిరిగి అదే పార్టీకి వెళ్లనున్నట్లు కేశవరావు స్పష్టంచేశారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని సమస్యలు పరిష్కరించడం సులువుగా ఉంటుందని హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి మీడియాతో ఇష్టాగోష్టిలో అన్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె తెలిపారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్‌ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బీజేపీకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం పార్టీలోకి వస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story