TS: గ్రామాల్లోనూ భారీగా దరఖాస్తులు

TS: గ్రామాల్లోనూ భారీగా దరఖాస్తులు
గ్రామాల నుంచి 2 లక్షల 78 వేల దరఖాస్తులు.... తొలిరోజు విజయవంతమైందన్న సీఎస్‌ శాంతకుమారి

తెలంగాణలో గ్రామాల్లోనూ ప్రజా పాలనకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు పోటెత్తారు. చాలా గ్రామాల్లో దరఖాస్తుల కోసం పోటీ పడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రాంతాల నుంచి తొలి రోజే 2 లక్షల 88 వేల 711 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో ముందుగానే దరఖాస్తులు అందక.. ఉదయం నుంచే ప్రజలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇంటర్నెట్, జిరాక్స్ కేంద్రాల వద్ద దరఖాస్తులు కొనుగోలు చేశారు. ఒక్కో ఫారాన్ని 30 నుంచి 100 రూపాయల వరకు అమ్మారు. పథకాల నిబంధనలపై దరఖాస్తుదారుల్లో కొంత అయోమయం నెలకొంది. ఇప్పటికే లబ్ధి పొందుతున్న పథకాలకు మళ్లీ దరఖాస్తు చేయాలా వద్దా.. కుటుంబం అంతా ఒకే దరఖాస్తు చేయాలా.. ఒక్కో పథకానికి ఒక్కొక్కరు వేర్వేరుగా దరఖాస్తు చేయాలా వంటి అనుమానాలు ఎక్కువగా ప్రజల్లో కనిపించాయి. ఒక్కో కేంద్రంలో ఒక్కో అధికారి ఒక్కో తీరుగా వివరించడం కొంత గందరగోళానికి దారితీసింది. ఇప్పటికే ఫించన్లు పొందుతున్నవారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని... రైతు భరోసా కోసం మళ్లీ దరఖాస్తు చేయాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా తెలిపారు.


మొదటి రోజు ప్రజా పాలన సదస్సులు విజయవంతమయ్యాయని... గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుంచి భారీ ఆదరణ లభించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతీ కేంద్రంలోనూ సరిపోయే విధంగా అభయహస్తం దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని CS స్పష్టం చేశారు. అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని శాంతి కుమారి స్పష్టం చేశారు. ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నంబర్ ఇవ్వాలని మరోసారి సూచించారు. ఫారాలను నింపడానికి... ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలన్నారు.

హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ కేంద్రంలో దరఖాస్తు ఫాంలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కేంద్రానికి ఎక్కువమంది కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలుచోట్ల దరఖాస్తులు సరిపోకపోవడంతో అధికారులే జిరాక్స్‌ తీయించి.. ప్రజలకు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం తొలిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా మొదలైంది. ఉదయమే అన్ని గ్రామాల్లో రెవెన్యూతో పాటూ ఇతర శాఖల సిబ్బంది కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు అభయహస్తం దరఖాస్తులు అందజేశారు. ఎమ్మెల్యేలతో పాటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పలు గ్రామాల్లో పాల్గొని దరఖాస్తుల స్వీకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Tags

Read MoreRead Less
Next Story