PRAJAAPLANA: గ్రామాల్లోనూ భారీగా దరఖాస్తులు

PRAJAAPLANA: గ్రామాల్లోనూ భారీగా దరఖాస్తులు
గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు.... దరఖాస్తుల కొరతతో కొన్ని చోట్ల అవస్థలు

తెలంగాణలోని గ్రామాల్లోనూ ప్రజా పాలన దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాల్టీ పరిధిలో ప్రజాపాలన సదస్సులను మెదక్ జిల్లా నోడల్ అధికారి సంగీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధులు, మహిళలకు సాయపడాలన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో దరఖాస్తులకు ప్రజలు పోటెత్తారు. నడిగూడెం మండల తహసీల్దార్‌ హేమమాలిని, ఎంపీడీవో ఇమామ్‌, స్పెషల్‌ ఆఫీసర్లు దుర్గయ్య, వీరారెడ్డి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నందిలో ప్రజా పాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. గ్రామస్తుల వద్ద దరఖాస్తులను స్వీకరించి అధికారులకు అందజేశారు.


వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవంతపురంలో ప్రజా పాలన సదస్సుకు ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు హాజరయ్యారు. వందశాతం అర్హులైనవారికి అభయాస్తం ఫలాలు అందజేస్తామన్నారు. కుటుంబానికి ఒకే దరఖాస్తు సమర్పించాలని ప్రజా పాలన ఆరు గ్యారంటీల కార్యక్రమం ప్రత్యేక అధికారి రఘునందన్‌రావు అన్నారు. ప్రజా పాలన దరఖాస్తుల కార్యక్రమాన్ని ఖమ్మంలో ఆయన పరిశీలించారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ అభయాస్తం పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం కింద మహరాష్ట్ర వాసులు దరఖాస్తు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అట్టి వాటిని పరిశీలించి తొలగిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ వెల్లడించారు. నిర్మల్‌లో నోడల్ అధికారి ప్రశాంతి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రశీదు అందించాలని అధికారులను సూచించారు. ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన సందేహాలను ములుగు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఏటూరునాగారం పల్లెల్లో స్వయంగా నివృత్తి చేశారు.

ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు ఇస్తూ గుండెపోటుతో ఒకరు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్‌లో జరిగింది. లక్ష్మయ్య అనే వ్యక్తి సదస్సులో నిలబడి కుప్పకూలిపోగా...స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపే మృతిచెందారు. ఫలితంగా జిరాక్స్ సెంటర్ల నుంచి ఒక్కో దరఖాస్తును 40 రూపాయలకు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని వాపోయారు. చాలా ప్రాంతాల్లో అభయాస్తం దరఖాస్తులు అందక ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడినన్ని అప్లికేషన్ ఫారాలు రానందునే ప్రజలు జిరాక్స్ సెంటర్ల వద్ద కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రజాపాలన సిబ్బంది వివరించారు. ఉచితంగా అభయహస్తం ఫారాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story