TS: వైభవంగా పతంగుల పండుగ

తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ వైభవంగా నిర్వహిస్తోంది. హైదారాబాద్ నెక్లెస్‌రోడ్, వరంగల్‌లోనూ పతంగుల పండగ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని చిన్నా,పెద్దా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కైట్ ఫెస్టివల్‌లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. జనవరి 22న జరిగే అయోధ్య రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అందరూ హాజరు కావాలని కోరారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న కైట్ , స్వీట్ ఫెస్టివల్‌కు ప్రజల నుంచి అనుహ్య స్పందన వస్తోంది. నగరవాసులు కుటుంబ సమేతంగా చిన్నా,పెద్దా కలిసి పతంగులు ఎగురవేస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లలేని పట్నంవాసులంతా పరేడ్‌గ్రౌండ్‌కు తరలివచ్చి పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. 16దేశాల నుంచి తరలివచ్చిన ఔత్సాహికులు రంగురంగుల, పెద్ద పతంగులతో అలరించారు. అందరితో కలిసి గాలిపటాలు ఎగురవేయడం మధురానుభూతిగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వేడుకల్లో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని జనం చెప్పారు. సంక్రాంతి పండగను తెలుగులోగిళ్లలో ఉత్సాహంగా జరుపుకుంటారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నెక్లెస్‌రోడ్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని పతంగిని ఎగురవేసి చిన్ననాటి మధురస్మృతులను గుర్తుచేసుకున్నారు. పాశ్చాత్య సంస్కృతి వల్ల మన పండగలు ప్రాశస్త్యం కోల్పొతున్నాయని అభిప్రాయపడ్డారు.
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన కైట్స్ ఫెస్టివల్ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా వేడుకలను ప్రారంభించారు. పిల్లలతో పాటు పెద్దవాళ్లూ ఉత్సాహంగా పాల్గొని పతంగులు ఎగురవేశారు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన పిండివంటలు..అందరినీ నోరూరించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com