PRAJAAPLANA: రెండోరోజూ విశేష స్పందన

PRAJAAPLANA: రెండోరోజూ విశేష స్పందన
ప్రజాపాలనకు 8 లక్షలకుపైగా దరఖాస్తులు...దరఖాస్తులు అందక ప్రజల తిప్పలు

తెలంగాణలో ప్రజాపాలన సదస్సులో రెండో రోజూ ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. తొలిరోజు దరఖాస్తులు 7లక్షలకు పైగా రాగా రెండోరోజు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 12 వేల 862 వచ్చాయి. ఇళ్ళ వద్దకు దరఖాస్తులు అందకపోవడం వల్ల రెండోరోజూ బయటనే చాలా మంది కొనుగోలు చేశారు. నిబంధనలు, దరఖాస్తులు వివరాలపై అయోమయం గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రజాపాలన సదస్సులో దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది. ఐదు గ్యారెంటీ పథకాల కోసం రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో 15 లక్షల 59వేల 276 దరఖాస్తులు వచ్చాయి. మొదటి రోజు 7 లక్షల 46వేల 414 దరఖాస్తులు రాగా.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 12 వేల 862 వచ్చాయి. GHMC, ఇతర కార్పొరేషన్లు, పట్టణాల్లో 4 లక్షల 89 వేల దరఖస్తులు రాగా.. గ్రామాల్లో 3 లక్షల 23 వేల 862 వచ్చాయి. దరఖాస్తులు తామే ఉచితంగా ఇస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ... కేంద్రాల సమీపంలో బయటి వ్యక్తులు 20 నుంచి 100 రూపాయల వరకు ఫారాలను అమ్ముతున్నారు. మరోవైపు దరఖాస్తుల్లో నింపాల్సిన అంశాలు, పథకాలకు సంబంధించిన నిబంధనలపై ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి. అధికారులు ఒక్కొక్కరు ఒక్కోతీరుగా చెబుతుండడం మరింత గందరగోళానికి దారితీస్తోంది.


ప్రజాపాలనపై రెండో రోజూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నందున ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృతం కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారని సీఎస్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అభయహస్తం దరఖాస్తులకు రాజధాని వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ఆహ్వానించిన ఐదు గ్యారంటీల్లో నగరవాసులు మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో అర్జీలు పెట్టుకుంటున్నారు. బల్దియాలో ఏర్పాటు చేసిన 600 కేంద్రాల్లో ఎక్కడ చూసినా దరఖాస్తుదారులతో కోలాహలం నెలకొంది. అభయహస్తం గ్యారంటీలకు తోడు రేషన్ కార్డు కోసం ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. తెల్లకాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్‌కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రేటర్‌ పరిధి ఆరు జోన్లలో కలిపి 3 లక్షల 13 వేల 226 దరఖాస్తులు వచ్చాయి.

ముషీరాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా గ్యారంటీల కోసం ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పథకానికి ప్రత్యేక దరఖాస్తు అవసరమా అని అధికారుల నుంచి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఫారాల కోసం జిరాక్స్ కేంద్రాలకు జనం పోటెత్తుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భాగ్యనగరంలో డిమాండ్‌కు సరిపడా అభయాస్తం దరఖాస్తులను సమకూర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story