Traffic challan : కోట్లు కుమ్మరిస్తోన్న వన్‌ టైమ్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌..!

Traffic challan :  కోట్లు కుమ్మరిస్తోన్న వన్‌ టైమ్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌..!
Traffic challan : తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వస్తోంది. గత పదిహేను రోజుల్లో ఏకంగా కోటి 30 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయి.

Traffic challan : తెలంగాణలో పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల క్లియరెన్స్‌కు భారీ స్పందన వస్తోంది. గత పదిహేను రోజుల్లో ఏకంగా కోటి 30 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఇప్పటివరకు 130 కోట్లు జమయ్యాయి. ఒక్క హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచే 80 శాతం ట్రాఫిక్‌ చలానాలు క్లియర్‌ అయ్యాయి. ఇప్పటి వరకు 500 కోట్ల విలువైన చలానాలకు రాయితీ ప్రకారం 130 కోట్లు వసూలయ్యాయని పోలీసులు తెలిపారు.

పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాల ద్వారా మొత్తంగా 300 కోట్లు వసూలవుతాయని అంచనా. మార్చి 1 నుంచి ఈ సదుపాయం అమల్లోకి రాగా ఈనెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. నోమాస్క్‌ కేసులకు 90 శాతం... టూవీలర్‌, త్రీవీలర్‌ వాహనాలకు 75 శాతం... ఆర్టీసీ బస్సులకు 70 శాతం.. కార్లు, హెవీ మోటార్‌ వెహికిల్స్‌కు 50శాతం... తోపుడు బండ్లకు 80 శాతం రాయితీ కల్పించారు.

డిసెంబర్ 2021 వరకు 80లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయని తేల్చిన పోలీసులు.. పెండింగ్ చలాన్ క్లియరెన్స్ కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చారు.. వన్ టైమ్ డిస్కౌంట్ పేరుతో పెట్టిన చలాన్ల క్లియరెన్స్‌కు ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. నిమిషానికి 700 పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ అవుతున్నాయి. మొదటి రోజే అయిదున్నర కోట్లు చలాన్ల రూపంలో ఫైన్‌లు చెల్లించారు.

ఈ గడువును ఉపయోగించుకోని వారు..తనిఖీల్లో చలాన్లు ఉంటే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీలు చేసి చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చలాన్లను క్లియర్ చేయని వారు ఆన్ లైన్, మీ సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లింపులు చేయొచ్చని సూచిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌లను ముమ్మరం చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు .ఫైన్లు తగ్గించారని రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని వాహనదారులను హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story