Jogulamba Gadwal District: చనిపోయిన భార్యకు గుడి.. ప్రేమను చాటుకున్న భర్త..

Jogulamba Gadwal District: ఎవరికి ఎవరు సొంతము.. ఎంతవరకీ బంధమూ.. సినీ గేయకవి అన్నట్లుగా మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబందాలుగా మారుతున్న ఈ రోజుల్లోనూ చనిపోయిన భార్యకు గుడి కట్టించి ఆరాదిస్తున్నాడు ఓ భర్త. భార్య పంచిన ప్రేమను మర్చిపోలేక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తున్నాడు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణానికి చెందిన గంటలబోయిన హన్మంతు, రంగమ్మ భార్యభర్తలు. వీరికి ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు. భార్య రంగమ్మ అనారోగ్యంతో 2019లో మరణించింది. తనతో ఆరు దశాబ్దాలకు పైగా జీవితం పంచుకున్న భార్యను అప్పటినుంచి మర్చిపోలేకపోతున్నాడు 83ఏళ్ల హన్మంతు. ఆమె ఎప్పటికీ తన కళ్లముందే ఉండాలనుకున్నాడు. భార్యపై ప్రేమతో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు 83ఏళ్ల హన్మంతు.
ఉళ్లో దాతల సహకారంతో గతంలో శివరామాంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించిన హన్మంతు.. ఆ గుడి పక్కనే ఉన్న తన పొలంలో భార్యకు ఓ మండపం కట్టించి, అందులోనే విగ్రహాన్ని ప్రతిష్టించారు. బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. హన్మంతు చాటుకున్న ప్రేమను చూసి మనవళ్లు, మనవరాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హన్మంతుకు భార్యపై ఉన్న ప్రేమ వెలకట్టలేనిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com