భర్త పైశాచికం.. భార్య మగ పిల్లాడిని కనలేదనే కారణంతో..

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పహిల్వాన్‌పురంలో భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. మగ పిల్లాడిని కనలేదనే కారణంతో.. తనతో పాటు నాలుగేళ్ల కుమార్తెను రోడ్డుపై వదిలేశారని.. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. మగ పిల్లాడు పుట్టకపోవడానికి తనను బాధ్యురాలిని చేస్తున్నారని కన్నీటి పర్యంతవుతోంది. ఆరేళ్ల నుంచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తోంది.
ఆరేళ్ల క్రితం పెళ్లి అయిందని... అప్పటి నుంచి తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని బాధిత మహిళ తెలిపింది. తన తల్లిదండ్రుల పరువు కోసం ఇన్నేళ్లుగా చిత్రహింసలు భరిస్తున్నానని వెల్లడించింది. మగపిల్లాడు పుట్టకపోతే తన తప్పా అని కన్నీళ్లు పెట్టుకుంది.
బాధిత మహిళకు స్థానికులు మద్దతుగా నిలిచారు. మగపిల్లాడినే ఎలా కంటారని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆడపిల్లను భారమనుకోవడం అమానుషమని మండిపడుతున్నారు. బాధిత మహిళకు న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళకు న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com