Bandi Sanjay: ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలు: బండి సంజయ్

bandi sanjay (tv5news.in)
Bandi Sanjay: హుజురాబాద్‌లో ప్రచారం తుది దశకు చేరుకుంది. దీంతో స్టార్ క్యాంపెయినర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అభ్యర్ధులు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు మంత్రి హరీశ్ రావు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని మాచాన్‌పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి రైతులు, సామాన్యులను మోదీ ప్రభుత్వం పీడిస్తోందని విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అయిపోగానే సిలిండర్ ధర మరో 200 పెరగడం ఖాయమన్నారు. బీజేపీకి ఓటేస్తే సిలిండర్ ధర 15 వందలు అవుతుందన్నారు. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు.
ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని విమర్శించారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి పేరుందని.. సీఎంగా ఉంటూ నిందలేయడం సరికాదన్నారు. తెలంగాణలో కోవిడ్ ఉంది.. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖలు రాసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. దళిత బంధుపై హుజూరాబాద్ నుండే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నామన్నారు.
నాడు ఉద్యమాల కోసం బలిదానం చేసుకుంటే.. నేడు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందన్నారు బండి సంజయ్. వచ్చే నెల 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలన్నారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు ట్రిపుల్ ఆర్ సినిమా చూపిస్తామన్నారు. ఉద్యమవీరుల త్యాగాలపై టీఆర్‌ఎస్ పార్టీని విస్తరించారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఏడున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
ఉద్యోగాల నోటిఫికేషన్, ఫీజు రియంబర్స్‌మెంట్, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యపై వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓయూకు ఎంత నిధులు కేటాయించారో చర్చించుకుందాం రండని సవాల్ చేశారు. బిశ్వాల్ కమిటీ లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రిపోర్టులో పేర్కొందని, నోటిఫికేషన్లు అప్పుడు ఇప్పుడు అంటూ నిరుద్యోగులను వంచిస్తున్నారని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com