Huzurabad By Election: హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ఎలా ముగిసిందంటే..

Huzurabad By Election: హుజూరాబాద్ బై పోల్ పోలింగ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. రికార్డ్‌స్థాయిలో పోలింగ్ నమోదైంది. నియోజకవర్గం నాలుగు సెగ్మెంట్‌ల పరిధిలోని 306 పోలింగ్ కేంద్రాల్లో గంట గంటకూ ఓటర్లు..పెద్దఎత్తున తరలి రావటంతో భారీగా పోలింగ్ నమోదైంది. మరోవైపు కరోనా నేపథ్యంలో పోలింగ్ టైమ్ పొడగించటం.. భారీగా డబ్బులు పంపకం, విచ్చలవిడిగా మద్యం సరఫరా..చివరి గంట వరకు ప్రలోభాల పర్వంతో పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.
నియోజకవర్గంలోని నాలుగు సెగ్మెంట్‌లలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తన స్వగ్రామమైన వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో ఓటువేశారు.
ఈ సందర్భంగా ఓటర్లకు అభివాదం చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అటు కమలాపురంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, జమున దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనటం మంచి సంకేతమని ఈటల పేర్కొన్నారు. మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీలు పోలింగ్ సరళిని ప్రతిష్టాత్మకంగా భావించటంతో పలు ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
జమ్మికుంట 28వ వార్డులో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంటి వద్ద బీజేపీ నేతలు ఆందోళన చేశారు. అధికారపార్టీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డబ్బులు పంచారని బీజేపీ నేతలు ఆరోపించారు. దీంతో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఇంటి వద్దకు చేరుకున్న సీపీ సత్యనారాయణ.. ఇంట్లో సోదాలు చేసి ఎమ్మెల్యే ఇక్కడ లేరని తెలిపారు. కౌన్సిలర్ ఇంట్లో ఉన్న నాన్‌లోకల్ వాళ్లపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. మరోవైపు పోలీస్ కమిషనరే ఎమ్మెల్యేను తప్పించారని బీజేపీ నేతలు ఆరోపించారు.
అటు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా బీజేపీ అభ్యర్థి ఈటల పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయటమేగాక ఆయన సతీమణి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వస్తుందని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీణవంక మండలం ఘన్ముక్లలో పోలింగ్ బూత్‌లోకి వెళ్తున్న టీఆర్‌ఎస్ నేత కౌశిక్‌రెడ్డిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కౌశిక్‌రెడ్డి ఎన్నికల కేంద్రంలో ఎలా ప్రచారం చేస్తారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.
వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌లో బీజేపీ నాయకురాలు తుల ఉమ పోలింగ్ కేంద్రం దగ్గరికి రావడాన్ని టీఆర్‌ఎస్ నాయకులు వ్యతిరేకించారు. టీఆర్‌ఎస్ నేతలను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. కోర్కల్ గ్రామంలో వృద్ధుల ఓట్లను టీఆర్‌ఎస్ వాళ్లు వేస్తున్నారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. జమ్మికుంటలో ఓటు వేయడానికి వెళ్తున్న మహిళపై టీఆర్‌ఎస్ నాయకులు చేయి చేసుకున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు...SPOT
ఇది ఇలా ఉంటే ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో గజ్వేల్ మార్కెట్ ఛైర్మన్ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ..ఆయన్ను ఘెరావ్ చేసినట్టు సమాచారం. మల్లాలలో డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను స్థానికులు గ్రామస్తులు చితగ్గొట్టారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగినా కాంగ్రెస్ ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించలేదని తెలుస్తోంది.
అక్కడక్కడ ఘర్షణ తలెత్తినా.. హుజురాబాద్‌లో పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఇంద్రానగర్ గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ కర్ణన్ సందర్శించారు. వీణవంకలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన కరీంనగర్ సీపీ పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.
భారీగా పోలింగ్ నమోదుతో గెలుపుపై అటు అధికార టీఆర్ఎస్, ఇటు బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్స్‌లో నిక్షిప్తం చేయటంతో గెలుపు ఎవరిదనేదీ తేలాంటే నవంబర్ 2 వరకు వేచిచూడక తప్పడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com