HYD: జీసీసీలకు హైదరాబాద్, బెంగళూరులే అడ్డా

భారతదేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCC) ప్రధాన కేంద్రాలుగా హైదరాబాద్, బెంగళూరు ఆధిపత్యం కొనసాగుతోంది. దేశంలోని ప్రతి 10 జీసీసీల్లో 7 కేంద్రాల నాయకత్వం ఈ రెండు నగరాలపైనే ఆధారపడి ఉందని క్వెస్ కార్ప్ విడుదల చేసిన ‘India’s GCC–IT Talent Trends 2025’ నివేదిక వెల్లడించింది. నూతన జీసీసీల కోసం ఉద్యోగ నియామకాలు, సేవలు, టాలెంట్ అవసరాల పరంగా హైదరాబాద్ అత్యంత వేగంగా ఎదుగుతోందని నివేదిక తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 42% అధిక డిమాండ్ హైదరాబాద్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. టాలెంట్ ప్రీమియం 6–8% వరకు పెరిగి, కంపెనీలను ఆకర్షిస్తున్నది. బెంగళూరు ఇప్పటికీ టాప్ టెక్ టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. డిమాండ్ అధికం కారణంగా ఇక్కడ ఖర్చు 8–10% వరకు మార్కెట్ సగటును మించి ఉందని నివేదిక చెబుతోంది. చెన్నై ఫైనాన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, కంట్రోల్–ఓరియెంటెడ్ జీసీసీ ఆపరేషన్లకు కీలక గమ్యస్థానంగా ఎదుగుతోంది. 94% రిటెన్షన్ రేటుతో చెన్నై దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ నిలుపుదల సాధించింది. అనలిటిక్స్, క్వాలిటీ అస్యూరెన్స్ రంగాల్లో పుణె బలపడుతుండగా, 2వ శ్రేణి నగరాల్లో కొచ్చి, కోయంబత్తూర్, అహ్మదాబాద్, ఇండోర్ వేగంగా గుర్తింపు పొందుతున్నాయి. క్వెస్ కార్ప్ విడుదల చేసిన మరో నివేదిక ‘India New GCC Talent Trends 2025’ ప్రకారం, ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో నైపుణ్య లోటు స్పష్టంగా కనిపిస్తున్నట్లు తేలింది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్
స్థిరాస్తి కన్సల్టెంట్ ప్రాప్‌టైగర్ (PropEquity) విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్ నగరంలో ఇళ్లు/ఫ్లాట్ల ధరలు 13% మేర పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో చదరపు అడుగుకు సగటు ధర రూ.6,858 ఉండగా, ఈసారి అది రూ.7,750కి చేరుకుంది. విలాసవంతమైన ఇళ్లు, ఫ్లాట్లకు గిరాకీ పెరగడం వల్లే ఈ ధరల పెరుగుదల కనిపించినట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్‌తో సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల సగటు ధరలు 7% నుంచి 19% వరకు వృద్ధిని నమోదు చేశాయని ప్రాప్‌టైగర్ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

