Hyderabad: మళ్లీ గజగజ...

చలి తగ్గుముఖం పడుతోందని మురిసిపోతున్న నగరవాసులకు వాతావరణ శాఖ మరోసారి వణికించే వార్తను మోసుకొచ్చింది. హైదరాబాద్ మళ్లీ చలి గుప్పెట్లో చిక్కుకోనుందని వెల్లడించింది. జనవరి 26 నుంచి కోల్డ్ వేవ్ మొదలవ్వబోతోందని తెలిపింది.
నగరంలో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల కనిష్ఠ స్థాయికి పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం జనవరి 26న ఉష్ణోగ్రతలు 14డిగ్రీల కనిష్ఠ స్థాయికి చేరుకోనుందని స్పష్టం అవుతోంది. గరిష్ఠంగా 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
జనవరి 27 వరకూ హైదరాబాద్ లోని చార్మినార్, ఖైర్తాబాద్, ఎల్.బి.నగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉదయం పూట మంచు దుప్పటి పరచుకోనుందని తెలుస్తోంది.
ఇక ఈ కోల్డ్ వేవ్ నగరానికి మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ఆదిలాబాద్, కొమరంభీమ్, నిర్మల్, మంచీరియల్, నిజామాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్ -మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి లో గురువారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. ఈ ప్రాంతాలతో పాటూ నగరంలోనూ వాతావరణ శాఖ ఎల్లో ఎలెర్ట్ జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com