Hyderabad : ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

ఒత్తిడి తట్టుకోలేక పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు తూర్పు గోదావరికి చెందిన శ్రీవెంకటేశ్వర్లు, శిరీష దంపతులకు సంజన. మోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు హైదరాబాద్ లోని కేవీఆర్ టవర్స్‌లో నివాసముంటున్నారు. శ్రీవెంకటేశ్వర్లు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అతని భార్య శిరీష ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అయితే వీరి కుమార్తె సంజన(14) పఠాన్‌చెరువు, బీరంగూడలోని అకడమిక్ స్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది.
శుక్రవారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు సంజన తిరిగి ఇంటికి వచ్చింది. అనంతరం తన గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. చాలా సేపటి వరకు సంజన బయటికి రాకపోవడంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్‌లు తలుపులు కొట్టారు. అయినా ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులు బద్దల కొట్టి లోపలికి వెళ్లేసరికి సీలింగ్ ఫ్యాన్‌కు సంజన ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే సంజన మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సంజన గదిలో ఓ పేపర్‌పై హాయ్ అమ్మా.. నాన్న..మోహిత్ నేను స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను ప్లీజ్ నన్ను క్షమించండి..ఐ లవ్ యూ.. అని రాసి పెట్టింది. దీంతో చదువు ఒత్తిడి తట్టుకోలేకే సంజన ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల ప్రాథమిక అంచనలో తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com