Hyderabad Bonalu : బోనం ఎత్తేందుకు సిద్ధమైన భాగ్యనగరం.. ఈ సారి ధూమ్‌ధామ్‌గా

Hyderabad Bonalu : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబైంది. గతేడాది కోవిడ్ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది. అలాగే ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా ఇవాళే ప్రారంభమవుతుంది.
లంగర్ హౌజ్ నుంచి తొట్టల ఊరేగింపుతో గోల్కొండ బోనాల సందడి మొదలవుతాయి. మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి గోల్కొండలోని మహాంకాళీ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభిస్తారు. గోల్కొండ మహాంకాళీ అమ్మవారికి ప్రతి ఆది, గురువారల్లో నెల రోజుల పాటు మొత్తం 9 పూజలు నిర్వహిస్తారు.. ఈ నెల రోజులూ... గోల్కొండ కోటపై భక్తులకు ఉచిత ప్రవేశం ఉంటుంది.
ఇక సికింద్రబాద్ ఉజ్ఙయినీ మహాoకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలకు ఇవాళే అంకురార్పణ. మొత్తం 15 రోజుల పాటు అమ్మవారు సికిoద్రాబాద్ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దీవెనలు ఇవ్వనుంది. ఈనెల 25న సికిoద్రాబాద్ బోనాలు, 26వ తేదిన రంగo, అదే రోజున ఫలహారాల బండ్ల ఊరేగింపు ఉంటుంది.
ఈ నెల 13న బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం జరగనుంది. అదేవిధంగా ఆగస్టు 1న ఓల్డ్ సిటీ లాల్‌దర్వాజ సింహవాహిని మహాంకాళి అమ్మవారి బోనాలు మొదలవుతాయి. ఆగస్టు 2న రంగం, భవానీ రథయాత్ర నిర్వహిస్తారు. గత ఏడాది కరోనా కారణంగా ఇళ్లలోనే మొక్కులు చెల్లించిన ప్రజలు... ఈ సారి ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం 15 కోట్ల రూపాయలతో అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మొత్తం మీద పోతూరాజుల విన్యాసాలు ,శివ సత్తుల పునకాలతో భాగ్య నగరం నెల రోజుల పాటు పల్లెను తలపించనుంది. గోల్కొండలో మొదలయ్యే బోనాల ఉత్సవాలను... నగరంలో ఉన్న అన్ని అమ్మవారి ఆలయాల్లో నిర్వహించి, చివరగా గోల్కొండలోనే ముగించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com