KTR-Konda Surekha: కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు

KTR-Konda Surekha:  కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు
X
భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చెయ్యద్దు అంటూ హితవు

మంత్రి కొండా సురేఖపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్‌ కోర్టులో విచారణ జరిగింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను న్యూస్‌ ఛానళ్లు, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో తొలగించాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 21కి వాయిదా వేసింది. తన పరువుకు భంగం కలిగేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై రూ.100కోట్లకు కేటీఆర్‌ దావా వేసిన విషయం తెలిసిందే.

దేశంలో ఇదే మొదటి సారి..

పరువు నష్టం కేసుకు సంబంధించిన ఓ కేసులో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిపై కోర్టు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం ఇదే తొలిసారి. గతంలోనూ కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖలో ఎలాంటి మార్పు రాలేదు. తన వ్యక్తిత్వ హననం చేసే విధంగా చేసే ఏ ఆరోపణలను సహించేది లేదని ఇప్పటికే కేటీఆర్ స్పష్టం చేశారు. ఇకపై తన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కేసులో కోర్టు తాజా కామెంట్లతో కేటీఆర్ కు బలం చేకూరినట్లయింది.

కొండా సురేఖపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో కేటీఆర్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మంత్రి మాట్లాడిన మాటలు కొన్ని చెప్పలేని విధంగా ఉన్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు, పార్టీ ప్రతిష్ఠకు గండికొట్టాలనే ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆమె తనపై, సాటి మహిళ సమంత మీద ఎలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందో.. తన నోటితో కోర్టులో చెప్పలేననని అన్నారు. బహిరంగంగా (ఓపెన్‌ కోర్టులో) అసభ్య పదజాలాన్ని చదవడం మంచిదికాదని, ఆమె చేసిన వ్యాఖ్యలను పిటిషన్‌లో పేర్కొన్నట్టు విన్నవించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడి, ప్రజలకు సేవలందిస్తునట్టు తెలిపారు. తాను ఉన్నత విద్యావంతుడినని, అమెరికాలో, భారత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం చేశానని చెప్పారు. 2006లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో నెలకు రూ.4 లక్షల వేతనం సంపాదిస్తున్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామాచేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు.


Tags

Next Story