NCRB : ఫేక్ న్యూస్ వ్యాప్తిలో హైదరాబాద్‌ టాప్

NCRB : ఫేక్ న్యూస్ వ్యాప్తిలో  హైదరాబాద్‌  టాప్
విద్వేషాలు రెచ్చగొట్టే ఘటనలు అత్యధికం

తప్పుడు సమాచారం, వదంతుల ప్రచారం, వర్గాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి ఘటనలు హైదరాబాద్‌లోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. ఈ తరహా నేరాల్లో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ-NCRB 2022 నివేదిక ప్రకారం... గతేడాది దేశంలోని 19 మెట్రో నగరాల్లో ఈ తరహా ఘటనలకు సంబంధించి 97 కేసులు నమోదు కాగా ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే 57 ఘటనలు రికార్డైనట్లు NCRB ప్రకటించింది.

జాతీయ నేర గణాంక బ్యూరో విడుదల చేసిన లెక్కల ప్రకారం సైబర్‌ నేరాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా... నకిలీ వార్తల వ్యాపిలోనూమొదటి స్ధానంలో ఉండడం కలకలం రేపుతోంది. వర్గాలు, సమూహాల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టిన ఘటనలు భాగ్యనగరిలో ఎక్కువ సంఖ్యలో రికార్డవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 2022లో 41 కేసులు నమోదయ్యాయి. దేశంలోని మెట్రోనగరాల్లో ఇదే అత్యధికం. ముంబయి, దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర నగరాలు హైదరాబాద్‌ తర్వాతి స్థానంలోనే నిలిచాయి. అన్ని నగరాల్లో కలిపి 204 ఘటనలు నమోదయ్యాయి. దిల్లీ, కోయంబత్తూరులో మాత్రమే 20కి మించి కేసులు రికార్డయ్యాయి.

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, విద్వేషపూరిత వ్యాఖ్యలపై ప్రత్యేక నిఘా ఉంచడమే నగరంలో ఎక్కువ కేసులు నమోదవ్వడానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో సామాజిక మాధ్యమాల్లో వదంతులు, తప్పుడు పోస్టులపై నిఘా ఉంచేందుకు సైబర్‌క్రైమ్, స్మాష్‌ పేరుతో ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. ఎప్పటికప్పుడు తప్పుడు, విద్వేష వ్యాఖ్యల్ని గుర్తించి కేసులు నమోదు చేయడం వల్లే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందని తెలిపారు. ఈ ఘటనలపై ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. 2022లో తప్పుడు సమాచార వ్యాప్తిపై హైదరాబాద్‌లో 57, బెంగళూరులో 12, చెన్నైలో 10 కేసులు నమోదయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తికి సంబంధించి ముంబయిలో 7, దిల్లీలో 5, అహ్మదాబాద్‌లో 2, పుణెలో ఒక కేసు నమోదు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టి కేసులను చూస్తే హైదరాబాద్‌లో 41, దిల్లీలో 27, కోయంబత్తూరులో 25, ముంబయిలో 16, బెంగళూరులో 15, చెన్నై, కోల్‌కతాలో 14 కేసులు నమోదైనట్లు NCRB నివేదిక తెలిపింది

Tags

Read MoreRead Less
Next Story