FIRE ACCIDENT: అగ్ని ప్రమాదంపై యావత్ దేశం దిగ్ర్భాంతి

హైదరాబాద్ పాతబస్తీ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని... మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో చాలామంది చనిపోవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. . ఈ అగ్రిప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన కిషన్ రెడ్డి
చార్మినార్ లోని గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. త్వరగా స్పందించి ఉంటే ప్రాణ నష్టం తగ్గేదన్నారు. అగ్నిమాపక సిబ్బందికి మెరుగైన శిక్షణతో పాటు మెరుగైన టెక్నాలజీ పరికరాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పలువురు దుర్మరణం పాలవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఆవేదన వ్యక్తం చేసిన పవన్
గుల్జార్ హౌస్ ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరమని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మంటల్లో చిన్నారులు, మహిళలు సహా పలువురు మరణించడం విషాదకరమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
విచారణకు ఆదేశించిన తెలంగాణ సర్కార్
ఆదాన్ న్యూస్: చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి దారి తీసిన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గుల్జార్ హౌస్‌లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందడంపై రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
మృతుల కుటుంబాలకు పరిహారం
గుల్జార్ హౌస్‌లో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహాతో కలిసి ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కూడా రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
అండగా ఉంటామన్న పొన్నం
అగ్ని ప్రమాదంలో 17 మంంది మరణించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com