Hyderabad: భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం

తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం వరకు నిప్పులు కురిపించిన భానుడు.. సాయంత్రం ఆకాశమంతా మేఘావృతమై.. నగరంలో ఒక్కసారి బోరున వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎస్సాఆర్ నగర్, మాదాపూర్, ఫిలింనగర్, గచ్చిబౌలి, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, కోఠి, నాంపల్లి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది.
కూలిపోయిన చెట్లు
అకాల వర్షంతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు
సహాయక చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. జీహెచ్‌ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఆదేశించారు.
మరో రెండు రోజులు వర్షాలు
ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి మరత్వాడ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టం మీదగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com