వరుణ దేవుడు కరుణించాడు.. వాయు'గండం' తప్పింది

భాగ్యనగరం భారీ వర్షాలకు అతలాకుతలమైంది. ఎక్కడ చూసిన పొంగి ప్రవహిస్తున్న నీళ్లు, కూలిపోయిన ఇళ్లు, కొట్టుకుపోతున్న వాహనాలు. దాదాపు 30 ఏళ్ల తరువాత హైదరాబాద్ మీదుగా ప్రయాణించిన వాయుగుండం కర్ణాటకకు చేరడంతో పెను ప్రమాదం తప్పింది. గత మూడు రోజులుగా కురిసిన వర్షం నగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఇక మంగళవారం కురిసిన కుంభవృష్టికి పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు.. వేల మంది నిరాశ్రయులయ్యారు.
పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంపీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న పలువురిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాయుగుండం రాష్ట్రాన్ని దాటినా రాగల నాలుగు రోజులు తేలిక పాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి పోటెత్తిన వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. బుధవారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com