HYDERABAD: అధికారుల తీరుతో పౌరుడి జేబుకి రూ. 40 లక్షల "కన్నం"

HYDERABAD: అధికారుల తీరుతో పౌరుడి జేబుకి రూ. 40 లక్షల కన్నం
హైదరాబాద్‌ ఇంజనీరింగ్‌ అధికారుల పనితీరుపై నెటిజన్‌ విమర్శలు... రూ.40 లక్షల నష్టం వచ్చిందని ట్వీట్‌... బాధ్యత ఎవరిదంటూ కేటీఆర్‌కు ట్వీట్‌...

హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌ బృందం చేసిన చిన్న పొరపాటు వల్ల తనకు 40 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఓ పౌరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. అసలు ఏం జరిగిందంటే....మాదాపూర్‌కు చెందిన ఉదయ్ తేజ ఆడిటర్‌గా పనిచేస్తున్నాడు. అతడు గర్భిణి అయిన తన భార్యతో కలిసి కోకాపేట సమీపంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో వారు ప్రయాణిస్తున్న BMW కారు అందులో చిక్కుకుపోయింది. దీంతో చాలాసేపు ఆ దంపతులు కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది.అదృష్టవశాత్తు తమతో పాటు డ్రైవర్‌ కూడా ఉన్నాడని ఉదయ్‌ తెలిపాడు. కోకాపేటలో రోడ్డు నిర్మించిన ఇంజినీరింగ్ బృందం... చిన్న పారాపెట్ గోడకు రంధ్రాలు చేయడం మరచిపోయిందని తెలిపాడు. గోడకు డ్రైన్‌ హోల్స్‌ చేయకపోవడం వల్ల వర్షపు నీరు నాలాలోకి వెళ్లకుండా రోడ్డుపైనే నిలిచిపోయిందని దానివల్ల తాము చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపాడు.


ఉదయ్‌ తేజ దంపతులు గంటపాటు కారులోనే ఉన్నారు. తన భార్య గర్భిణీ కావడంతో.. అక్కడి నుంచి బయటపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని ఉదయ్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. మోకాళ్ల లోతు నీటి నుంచి తన భార్యను సురక్షిత ప్రదేశానికి తీసుకు రావడం చాలా కష్టమైందన్నాడు. చివరకు మిత్రుల సహయంతో అక్కడి నుంచి దంపతులు ఇద్దరూ బయటపడ్డారు. తాము మాదాపూర్‌ తిరిగి వెళ్తుండగా ఈ భయానక ఘటన జరిగినట్లు తెలిపాడు. BMW కారుకు ఉన్న ప్రత్యేక పార్కింగ్‌ మోడ్‌ వల్ల తాము వెంటనే అందులోనుంచి బయటపడలేక పోయామని ఉదయ్‌ వివరించాడు. రాత్రంతాతమ BMW కారుతో పాటు మరో 11 బీఎండబ్ల్యూలు, 8 మెర్సిడెస్ కార్లు వర్షంలోనే ఉన్నాయని తెలిపాడు. దీని వల్ల కార్లు చెడిపోయి కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని.. తనకు కూడా 40 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని వెల్లడించాడు. కారు డెలివరీ చేయడానికి రెండు నెలలు సమయం పడుతుందని సర్వీస్‌ సెంటర్‌ ఉదయ్‌కు తెలిపింది.


నాలాలను నిర్మించడం చాలా గొప్ప విషయమని... కానీ ఆ నాలాలోకి నీరు వెళ్లకుండా అడుగుల ఎత్తులో గోడను ఏర్పాటు చేయడం... దానికి రంద్రాలు చేయడమ మరిచిపోవడం ఓ కళాఖండమని ఉదయ్‌తేజ ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం 2016లో ప్రారంభించిన వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం SNDP ఏమైందని ప్రశ్నించాడు. SNDP అంటే ఇదేనా అని తన ట్వీట్‌లో ప్రశ్నించాడు. పర్యవేక్షణకు బాధ్యులైన ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. తన కారుకు జరిగిన నష్టానికి పరిహారం కూడా ఇవ్వాలని కోరారు.

Tags

Read MoreRead Less
Next Story