Hyderabad Metro: ప్రయాణికులకు షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో

Hyderabad Metro:  ప్రయాణికులకు షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో
రూ.59 హాలిడే కార్డును రద్దు చేసిన అధికారులు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. వేసవి నేపథ్యంలో ట్రైన్లలో రద్దీ పెరగటంతో మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సేవర్ హాలీడే కార్డును రద్దు చేశారు. అలాగే డిమాండ్ తక్కువగా ఉండే సమయాల్లో ఇచ్చే పది శాతం రాయితీని కూడా ఎత్తేశారు. మెట్రో అధికారుల నిర్ణయం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండలు, ఆపై అన్ని నిత్యవసర ధరలు పెరుగుతుంటే.. తక్కువ టికెట్ ధరతో మెట్రోలో ప్రయాణం సాగిద్దామంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో ట్రైన్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎండల్లో కూల్ కూల్ గా ప్రయాణించవచ్చని అనుకున్న ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీకి మంగళం పాడుతూ నిర్ణయం వెలువరించింది. ఉదయం, రాత్రి వేళల్లో ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణించే వారికోసం గతంలో అధికారులో రూ.59 హాలిడే కార్డును తీసుకొచ్చారు. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు చేసే ప్రయాణాల్లో టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంది.

కాగా, సూపర్ సేవర్ హాలీడే కార్డులను రద్దు చేస్తున్నట్లు ఈనెల 2న హైదరాబాద్ మెట్రో ప్రకటన విడుదల చేసింది. సూపర్ సేవర్ హాలిడే మెట్రో కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్‌లు మార్చి 31, 2024న ముగిశాయని ట్వీట్ చేసింది. స్టూడెంట్ మెట్రో కార్డ్‌తో ప్రయాణాలు 30 ఏప్రిల్ 2024 వరకు చెల్లుబాటులో ఉంటాయని చెప్పింది. అయితే ఇవాళ ఆదివారం కావటంతో చాలా మంది సూపర్ సేవర్ కార్డు రీఛార్జ్ చేసుకోవటానికి ప్రయత్నించారు. మెట్రో సిబ్బంది మాత్రం ఆఫర్ లేదని చెప్పటంతో ప్రయాణికులు ఖంగుతున్నారు. సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తూనే టికెట్ తీసుకున్నారు.

అయితే, రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలామంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికే మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story