BUDGET: పెరిగిన మెట్రో అంచనా వ్యయం

BUDGET: పెరిగిన మెట్రో అంచనా వ్యయం
X
రెండో దశలో దూరం కూడా పెంచుతున్నట్లు భట్టి ప్రకటన... రూ. 24, 042 కోట్లకు చేరిన అంచనా వ్యయం

హైదరాబాద్‌లోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. అయిదు కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం పెరిగి రూ.24,042 కోట్లకు చేరింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు. రాయదుర్గం నుంచి విప్రో కూడలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ వరకు 8 కి.మీ. మార్గాన్ని తొలుత ప్రతిపాదించారు. దీన్ని కోకాపేటలోని నియోపోలిస్‌ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ 3.3 కి.మీ.పైగా పెరిగింది. ఈ కారణంగా అంచనాలు పెరిగాయి. మెట్రో డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్దిరోజుల కిందట పరిశీలించారు.


నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి కూడలి నుంచి జల్‌పల్లి మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు తొలుత 29 కి.మీ.గా ఎయిర్‌పోర్ట్‌ మెట్రోని అంచనా వేశారు. ఇది కాస్త 4 కి.మీ.కుపైగా పెరిగింది. ఇదే కారిడార్‌లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్, కొత్త హైకోర్టు వరకు 5 కి.మీ.పైగా మెట్రో మార్గం కూడా రెండోదశలో ప్రతిపాదించారు. దీంతోపాటు ఎల్బీనగర్‌-హయత్‌నగర్, మియాపూర్‌-పటాన్‌చెరు, ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట కారిడార్లలో పెద్దగా మార్పుల్లేవు. నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్టలను మెట్రో ఇంటర్‌ఛేంజ్‌ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.

సంక్షేమాన్ని విస్మరించలేదు

తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని విస్మరించకుండా ఇప్పటివరకూ రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడించారు. గత పాలకులు అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా నడపాల్సిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒంటెత్తు పోకడలతో సొంత జాగీరులా నడిపారని తీవ్రంగా మండిపడ్డారు. గత ప్రభుత్వ తప్పిదాల పర్యవసానాన్ని మేం చవిచూస్తున్నామని... తమ సర్కారు ఏర్పడేనాటికే కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెనుసవాల్‌గా మారిందని భట్టి అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Tags

Next Story