METRO: మరింత విస్తరించనున్న హైదరాబాద్‌ మెట్రో

METRO: మరింత విస్తరించనున్న హైదరాబాద్‌ మెట్రో
X
ఫేజ్‌-2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్‌ సిద్ధం... ప్రతిపాదనలు సమర్పించిన అధికారులు

హైదరాబాద్ మహానగరంలో మెట్రోరైలు సేవలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. బీఆర్ఎస్‌ ప్రభుత్వం హయాంలో ప్రతిపాదించిన ఫేజ్-2 మార్గాన్ని రద్దు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి... కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఫేజ్-2లో 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ సిద్ధమైంది. మహానగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భాగ్యనగరంలోని నలుమూలాల నుంచి విమానాశ్రయానికి వెళ్లేలా కొత్త ప్రతిపాదిత మార్గాలను తయారు చేశారు.


సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ మెట్రో రైలు మరింత చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి LBనగర్, JBS నుంచి MGBS, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు అందుబాటులో ఉండి.... నిత్యం లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి MGBS వరకు ఉన్న రెండో కారిడార్‌ను... చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. మరో 4 కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు. MGBS మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు ఐదున్నర కిలోమీటర్ల పొడిగించనున్నారు. అలాగే... ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు కిలోమీటరున్నర మేర విస్తరించనున్నారు.


ప్రతిపాదిత కారిడార్-4లో భాగంగా... నాగోల్ నుంచి LBనగర్ వరకు... అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా... మైలార్ దేవ్‌పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ వరకు మొత్తం 29 కిలోమీటర్ల వరకు కొత్తగా మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు. ఇక ఇదే కారిడార్‌లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు రూట్ మ్యాప్ సిద్ధమైంది. కారిడార్ -5లో రాయదుర్గం మెట్రోస్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్‌రాంగూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మెట్రోమార్గం అందుబాటులోకి రానుంది. కారిడార్ - 6లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి BHEL మీదుగా పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. కారిడార్- 7లో LBనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు 8 కిలోమీటర్లు కొత్తగా మెట్రోరైలు మార్గానికి రూట్ మ్యాప్‌ సిద్ధం చేశారు. కొత్తగా 70 కిలోమీటర్లు మేర సిద్ధం చేసిన రూట్ మ్యాప్‌పై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Next Story