Hyderabad: మీర్‌పేటలో అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభ్యం
నగరంలోని మీర్‌పేటలోని జిల్లెలగూడలో అదృశ్యమైన బాలుడు మహీధర్‌రెడ్డి ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 4న ట్యూషన్‌కు వెళ్లిన బాలుడు.. ఆ తర్వాత కనిపించలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతిలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. మలక్‌పేటలో రైలు ఎక్కి తిరుపతి వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడి పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఉండగా.. తిరుమల విధులకు వెళుతున్న ఎఆర్ కానిస్టేబుల్ ప్రసాద్ బాలుడిని గుర్తించి, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. జిల్లెలగూడ దాసరినారాయణరావు నగర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డికి మౌనేందర్‌రెడ్డి, మహీధర్‌రెడ్డి(13) ఇద్దరు కుమారులు. మహీధర్‌రెడ్డి మీర్‌పేటలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజు ఇద్దరు అన్నదమ్ములు మీర్‌పేటలో ట్యూషన్‌కు వెళ్తుంటారు. ఈనెల 4న (ఆదివారం) సాయంత్రం సోదరుడితో ట్యూషన్‌కు వెళ్లారు. మహీధర్‌రెడ్డి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి తిరుపతి వెళ్తున్నట్లు గుర్తించి, అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే పోలీసులు మహీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడు తిరుపతి ఎందుకు వెళ్లాడనేదానిపై సమాధానం చెప్పటం లేదు. చదువుల ఒత్తిడి, ఇతర కారణాల వల్లే బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com