Hyderabad Real Estate: అందరి చూపు అటువైపు.. ఇళ్ల కొనుగోళ్లు ఎక్కువగా అక్కడే..

Hyderabad Real Estate: అందరి చూపు అటువైపు.. ఇళ్ల కొనుగోళ్లు ఎక్కువగా అక్కడే..
X
Hyderabad Real Estate: భాగ్యనగరం భద్రమైన జీవితం గడపొచ్చు. నలువైపులా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది.

Hyderabad Real Estate: భాగ్యనగరం భద్రమైన జీవితం గడపొచ్చు. నలువైపులా రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే నివాస ఖర్చులు తక్కువ కావడంతో ఉపాధి వలసలు కూడా అధికంగా ఉన్నాయి.. దీంతో ఇక్కడే శాశ్వత నివాసాల కోసం ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు పరిశ్రమలు తరలి రావడం గృహ, వాణిజ్య నిర్మాణాలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా స్థిరాస్థి రంగం జోరందుకుంది.

నగరం చుట్టూ భారీగా కొత్త ప్రాజెక్టులు వస్తుండడంతో కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. భూమి మీద పెట్టుబడి పెడితే లాభమే కానీ నష్టం ఉండదని ఈ రంగంపై ఆసక్తి చూపుతుంటారు వినియోగదారులు. అద్దెల రాబడి కూడా అధికంగా ఉంటుందని స్థిరాస్థి రంగంపై మొగ్గు చూపడం అధికమైంది.

మెట్రో సౌకర్యం అందుబాటులో ఉండడంతో.. ముఖ్యంగా ఉప్పల్, ఎల్బీ నగర్ మార్గం వైపు కూడా కొనుగోలు దారులు ఆసక్తి కనబరుస్తున్నారు. వరంగల్ రహదారి మార్గంలో ఘట్‌కేసర్ వరకు ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కొనుగోళ్లు వేగవంతం అయ్యాయి. ఎక్కడ ఉన్నా ఆఫీసుకు గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండడంతో శివారు ప్రాంతంలో కూడా కొనుగోళ్లు ఎక్కువయ్యాయి. దాంతో నిర్మాణాలు అదే స్థాయిలో అందుబాటులో ఉంటున్నాయి. మరోవైపు నాగోలు, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్ రెడ్డినగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ వరకు నివాసాలకు డిమాండ్ పెరిగింది.

నగర శివారు చుట్టూ 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు ఉన్న ప్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్, గచ్చిబౌలీ ప్రాంతాల్లో మరిన్ని ఐటీ కంపెనీలు వెలిసే అవకాశం ఉన్నందున కొండాపూర్, రాయదుర్గం, కోకాపేట్, మణికొండ, నార్సింగీ, పుప్పాలగూడ, ప్రగతి నగర్, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, బీరంగూడ ప్రాంతాల్లోని నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది.

Tags

Next Story