REVANTH: ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్

గ్లోబల్ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా హైదరాబాద్ స్థిరపడిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైటెక్స్ వేదికగా నిర్వహించిన బయోఆసియా సదస్సును ప్రారంభించిన ఆయన, నగరం గత రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరం అనే గుర్తింపు ఉండేదని, కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు.23 సంవత్సరాల క్రితం బయోఆసియా ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ బయోసైన్సెస్ రంగంలో ఎదుగుదల దశలో ఉందని గుర్తుచేశారు. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఈ విజయానికి ప్రధాన బలాలుగా నిలిచాయని అన్నారు. ఈ అంశాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు, పరిశోధన, డిజైన్ రంగాలకు అంతర్జాతీయ కేంద్రంగా మారిందని వివరించారు.
గత రెండు సంవత్సరాల్లోనే లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని సీఎం వెల్లడించారు. కొద్ది వారాల క్రితం దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించామని, పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీనోమ్ వ్యాలీని విస్తరించామని, ప్రపంచ స్థాయి పరిశోధనలకు “వన్-బయో” కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును వేగవంతం చేస్తూ, అనేక గ్లోబల్ సంస్థలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఇది సాధారణ అభివృద్ధి కాదని, దీర్ఘకాలిక విజన్ ఫలితమని సీఎం స్పష్టం చేశారు. బయోఆసియా-2026 ఈ విజయానికి ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొనడం గర్వకారణమన్నారు. ఫార్మా, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల ప్రముఖులు, వ్యాపార నాయకులు పాల్గొనడం హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిని ప్రతిబింబిస్తోందని చెప్పారు.
సైన్స్, కృత్రిమ మేధస్సు (AI), బయోటెక్ రంగాల కలయికతో అసాధారణ ఫలితాలు సాధ్యమవుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయోఆసియా సదస్సు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరహాలో అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కేంద్రంగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
