Hyderabad: హనీమూన్‌లో విషాదం.. హైదరాబాద్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఉద్యోగి

Hyderabad: పెళ్లై ఏడాది కూడా కాలేదు.. వివాహ జీవితపు మధురిమలను ఆస్వాదించనే లేదు.. హనీమూన్‌కు వెళ్లిన ఆ జంటను విధి విడదీసింది. హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆకస్మిక మరణం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది.
హైదరాబాద్‌లోని నాగోలు బండ్లగూడ అల్కాపురి కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వంశీకృష్ణకు గతేడాది జూన్‌లో శ్రావణితో వివాహమైంది. వంశీకృష్ణకు సివిల్స్ పట్ల ఆసక్తి ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు.. అందుకోసం నిరంతరం కష్టపడుతున్న అతడు గ్రూప్ వన్ పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు అర్హత సాధించాడు. మెయిన్స్ రాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బిజీ లైఫ్ నుంచి కాస్త ఉపశమనం కోరుకున్నాడు.. అందు కోసం వంశీ ఈ నెల 13న భార్య శ్రావణితో కలిసి ఇండోనేషియాకు వెళ్లాడు.
అక్కడ బాలికి కొంత దూరంలో ఉన్న పెన్నిడా ద్వీపం చూసేందుకు వెళ్లి అక్కడే బస చేశారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 20 మంది పర్యాటకులతో కలిసి పెన్నిడా ద్వీపంలోని సముద్ర ప్రాంతంలోని అక్వేరియం చేపలను చూసేందుకు శ్రావణి, వంశీ కూడా వెళ్లారు.
ముగ్గురు గైడ్‌లు, వంశీకృష్ణ కలిసి సముద్రంలోకి దిగారు. కానీ అంతలోనే సముద్రంలో గల్లంతై ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు సాయంత్రం వంశీ మృతదేహాన్ని సముద్రం నుంచి వెలికి తీశారు. రేపు సాయంత్రానికి వంశీ మృతదేహం హైదరాబాద్ చేరుకుంటుందని వంశీ కుటుంబ సభ్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com