Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ డ్రైవ్.. ఆ స్టిక్కర్లే టార్గెట్‌గా..

Hyderabad Traffic Police: కార్లు, బైక్‌లు, ఇతర వాహనాలపై ఎలాంటి స్టిక్కర్లు కనిపిస్తున్నా పీకేస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అంబటి రాంబాబు, గువ్వల బాలరాజు, ఎంఐఎం ఎమ్మెల్యే మీరాజ్ హుస్సేన్ పేర్లతో స్టిక్టర్లు పెట్టుకుని హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఏపీకి చెందిన పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్‌రెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉండడంతో దాన్ని కూడా తొలగించారు.
సిటీలో చాలా మంది.. ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకోవడం, పోలీస్ కాకపోయినా ఆ స్టిక్కర్‌తో బండి నడపడం.. ఇలా ఆర్మీ, డాక్టర్, ప్రెస్ అంటూ స్టిక్కర్లు అంటించుకుని తిప్పుతున్న వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసులు. అన్నీ చెక్ చేసి, స్టిక్కర్ పెట్టుకునేందుకు అర్హత ఉంటేనే అనుమతి ఇస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం తరువాత ట్రాఫిక్ పోలీసులు రూట్ మార్చారు.
ఇన్నాళ్లూ చూసీచూడనట్టు ఉన్న పోలీసులు.. ఇలాంటి దొంగ స్టిక్కర్ల వాహనాల భరతం పడుతున్నారు. దీంతో పాటు కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉన్నా కూడా పీకేస్తున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న వారు స్పష్టంగా కనిపించాల్సిందేనని, బ్లాక్ కోటింగ్ ఉన్న అద్దాలు అమర్చడం నిబంధనలకు విరుద్దమని చెబుతున్నారు. నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాలను సైతం తనిఖీ చేస్తున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com