గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో మళ్లీ పాత సీనే రిపీట్

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ లో మళ్లీ పాత సీనే రిపీట్ అయింది. ప్రతి గ్రేటర్ ఎన్నికల్లో లాగా ఈసారి కూడా పోలింగ్ శాతం భారీగా తగ్గింది. కేవలం 45.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా వెల్లడించారు ఎస్‌ఈసీ కమిషనర్ పార్థసారధి. అయితే... పోలింగ్ జరిగిన తీరు ఆందోళన కలిగించింది. సాయంత్రం ఐదు గంటల వరకు కేవలం 37శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. అనేక డివిజన్లలో 45 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదు. హయత్ నగర్ GHMC సర్కిల్లో 50శాతం ఓటింగ్ దాటింది. ఎల్బీనగర్ నగర్, సరూర్‌నగర్ , మల్కాజిగిరి సర్కిళ్లలో 50 శాతం లోపు పోలింగ్ నమోదైంది. ఇక... ఓల్డ్ మలక్‌పేటలో గుర్తుల తారుమారుతో పోలింగ్ రద్దైంది. ఇక్కడ రీపోలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన 149 డివిజన్లలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అటు... రీపోలింగ్ కారణంగా ఎగ్జిట్‌పోల్స్ ను నిషేధించింది ఎస్‌ఈసీ...
గ్రేటర్ పరిధిలో ఓటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రైవేటు ఉద్యోగులు ఊళ్లకు వెళ్లిపోయారు.. సిటీ మధ్యలో ఉన్న డివిజన్లలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.. అతి తక్కు పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొన్ని డివిజన్లలో ఓటింగే నమోదు కాకపోవడం విశేషం. ఓటర్లు ఓటు వేయడానికి ఎంత అనాసక్తిగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడం, కరోనా భయం నేపథ్యంలో ఓటింగ్ పై ప్రభావం చూపించాయి. కొన్ని చోట్ల కష్టనష్టాలకు ఓర్చి వయో వృద్ధులు, వికలాంగులు ఓటు వేశారు.. కానీ యువకులు, టెకీలు మాత్రం సెలవులు ఎంజాయ్ చేశారు. చాలా చోట్ల పోలింగ్ బూత్‌లు ఖాళీగా కనిపించాయి. ఓటర్లు లేక సిబ్బంది నిద్రపోయే పరిస్థితి ఏర్పడింది. ఓటు వేయని వారికి సమస్యలపై ప్రశ్నించే హక్కు ఎక్కడిదని నిలదీస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు. ఓటు వేయనికి వారికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలేవీ అందకుండా చూడాలనే డిమాండ్ చేస్తున్నారు..
GHMC పరిధిలో గతంలో ఎన్నికలు జరిగిన సందర్భంలోనూ ఇదే పరిస్థితి. 2016 గ్రేటర్ ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదుకాగా.. 2009 గ్రేటర్ ఎన్నికల్లో 42శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక 2014లో జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 53 శాతం.. 2018లో గ్రేటర్ పరిధిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50.86 శాతమే ఓటింగ్ నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ హైదరాబాద్ సెగ్మెంట్‌లో 44.75 శాతమే ఓట్లు పోలయ్యాయి.. ఇక విచిత్రంగా... జీహెచ్‌ఎంసీ పోలింగ్ ఇలా ముగిసిందో లేదో ... వైన్‌షాపులు, బార్ల ముందు బారులు తీశారు జనం. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లేక బోసిపోగా... వైన్‌షాపు, బార్లు వద్ద మాత్రం..... జనం కిటకిలాడారు. ఓటేయడానికి రాని జనం... మద్యం కోసం కోసం క్యూ కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com