HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనేది ఒక ప్రత్యేక విభాగమని, జీహెచ్‌ఎంసీలో భాగం కాదని స్పష్టం చేశారు. గతంలో ఈవీడీఎం పేరుతో జీహెచ్‌ఎంసీలో ఒక విభాగం ఉండేదని, అప్పుడు ఐఏఎస్, కమిషనర్లు ఉండేవారని, ఇప్పుడు ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడిందని రంగనాథ్ చెప్పారు. హైడ్రా పరిధిలోకి జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ లోపల ఉండే మరో 27 మున్సిపాలిటీలు కూడా వస్తాయన్నారు. ప్రభుత్వ స్థలాలు, హైదరాబాద్లోని చెరువులు పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం హైడ్రాను కొత్తగా ఏర్పాటు చేసిందన్నారు. హైడ్రా దేశంలోనే మొదటిసారి ఏర్పాటైందని, హైడ్రాకు మొదటి కమిషనర్‌గా రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.హైదరాబాద్‌లో నాలాలు, చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, వర్షం పడినప్పుడు వరద నీరు ఇంకడానికి చాలా సమయం పడుతున్నదని, సాయంత్రం నాలుగైదు గంటలకు వర్షం పడితే భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నదన్నారు. ప్రజలు వెదర్ అలర్ట్స్‌ని సీరియస్‌గా తీసుకునేలా హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ పేర్కొన్నారు.
చెరువుల రక్షణ హైడ్రా బాధ్యత
జల వనరులు, ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని కాపాడటమే హైడ్రా బాధ్యతని రంగనాథ్ అన్నారు. హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులని, గతంలో ఒక చెరువుకు మరో చెరువుకు కనెక్టివిటీ ఉండేదని, ఇప్పుడా కనెక్టివిటీ దెబ్బతిందన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకున్నా.. భారీ వర్షాలతో ముంపు పొంచి ఉందని, ఈ నేపథ్యంలో భారతీయ వాతావరణ శాఖ సమాచారం చాలా ముఖ్యమని, సాంకేతికతను అందిపుచ్చుకొని వర్ష సమాచారం ఇవ్వడం ఉపయోగంగా ఉంటుందన్నారు.
ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు
ఐఎండీ ఏ ప్రాంతంలో ఎంత మొత్తంలో వర్షం పడుతున్నదని, ఎక్కడ వరద ముప్పు ఉంటున్నదో అంచనావేసి ప్రజలను అప్రమత్తం చేయడం వంటి విధానాలను అందిపుచ్చుకొని ప్రయత్నిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో ఐఎండీ పాత్ర చాలా కీలకమని, ఐఎండీ పనితీరుతోనే ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గాయని గుర్తుచేశారు. డిజాస్టర్స్‌లో కూడా చాలా మార్పులు వస్తున్నాయని, తెలంగాణలో అర్బనైజేషన్ పెరుగుతున్నదని, 2050 నాటికి 50 శాతం దాటుతుందని చెప్పారు. మెట్రో సిటీస్‌లో వాతావరణ మార్పులు అధికంగా ఉంటున్నాయని, క్లౌడ్ బరస్ట్స్ పెరుగుతున్నాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com