HYDRA: హైడ్రా బూచి కాదు.. ఓ భరోసా

HYDRA: హైడ్రా బూచి కాదు.. ఓ భరోసా
X
చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం.. కీలక వ్యాఖ్యలు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

తాము కూల్చిన ఏ భవనానికి కూడా ఎలాంటి అనుమతులు లేవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యమని వెల్లడించారు. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన.. సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కొందరు బలవంతులు అక్రమ కట్టడాల వెనక ఉన్నారని రంగనాథ్ అన్నారు. అమీన్ పూర్‌లో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. హైడ్రాపై వ్యతిరేకత కొందరికి మాత్రమే ఉందని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తప్పుడు సర్వే నెంబర్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. హైడ్రాను బూచిగా.. రాక్షసిగా చూపుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిందని.. చెరువులు, నాలాలు కాపాడాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. హైడ్రా చర్యలు తీసుకోకపోతే కోటి మంది నగర ప్రజలే బాధితులు అవుతారని రంగనాథ్ అన్నారు.

ఆ కాలేజీలకు హైడ్రా కమిషనర్ హెచ్చరిక

హైడ్రా బూచి కాదు.. భరోసా అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలపై అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. చాలా కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయని.. ఈ విద్యా సంవత్సరం ముగిశాక వాటి సంగతి చూస్తామని అన్నారు. ఇప్పుడే చర్యలు తీసుకుంటే విద్యార్థులపై ప్రభావం పడుతుందనే ముందడుగు వేయలేదన్నారు. పరిశుభ్రమైన వాతావరణం రాజ్యాంగంలో భాగమని అన్నారు. దానినే తాము అమలు చేస్తున్నామని తెలిపారు.

హైడ్రాపై భయం పుట్టించొద్దు: కమిషనర్

హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించే వార్తలు ప్రసారం చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు. మూసీ ప్రాంతంలో భారీగా ఇళ్లు కూల్చేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్న వేళ ఆయన స్పందించారు. కొన్ని ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయన్నారు.

Tags

Next Story