HYDRA: దూకుడు పెంచిన హైడ్రా
హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. కూకట్‌పల్లి నల్లచెరువు, అమీన్‌పూర్‌లోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. రెండు రోజుల క్రితం డ్రోన్లతో సర్వే నిర్వహించిన అధికారులు అక్రమంగా భవనాలు, షెడ్లు నిర్మించిన వ్యక్తులకు తాఖీదులిచ్చి ఆదివారంలోపు ఖాళీ చేయకపోతే కూల్చేస్తామని హెచ్చరించారు. వారు స్పందించకపోవడంతో కూకట్‌పల్లి నల్లచెరువు, అమీన్‌పూర్‌లోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణమైన 25 విల్లాలు, బహుళ అంతస్తుల భవనాలు సహా 44 నిర్మాణాలను కూల్చేశారు. షెడ్లు, ఇతర నిర్మాణాల వద్ద వాటి యజమానులు, లీజుకు తీసుకున్నవారు ఆందోళన చేస్తుండడంతో పోలీసులు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇళ్లను నిర్మించుకుని నివాసముంటున్నవారి వద్దకు హైడ్రా అధికారులు వెళ్లలేదు. మూడు ప్రాంతాల్లో మొత్తం 8 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. వాటి విలువ రూ.200 కోట్లు ఉంటుందన్నారు.
భారీ బందోబస్తుతో కూల్చివేత
కూకుట్‌పల్లి, అమీన్‌పూర్‌లలో మొత్తం 3 చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే తమకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఇంట్లోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకెళ్లనివ్వకుండా కూల్చివేస్తున్నారంటూ పేదలు రోదించారు. కూల్చివేతల వద్ద కన్నీరు మున్నీరవుతున్నారు.నల్ల చెరువు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిని హైడ్రా అధికారులు కూల్చివేయగా.. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారంటూ బాధితులు చెబుతున్నారు. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లచెరువు వద్ద హైడ్రా డిప్యూటీ సిటీ ప్లానర్ రామిరెడ్డి, ఏసీపీ రమేశ్‌కుమార్.. కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడల్లో హైడ్రా ఎస్పీ పాపయ్య, డీసీపీ శ్రీనివాసరావు, పటాన్‌చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి పర్యవేక్షించారు. కూల్చివేతల సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆందోళనకు దిగిన స్థానికులు
హైడ్రా కూల్చివేతలతో బాధితులు ఆందోళనకు దిగారు. షెడ్లను కిరాయికి తీసుకున్నవారు కన్నీటి పర్యంతమయ్యారు. కొందరు జేసీబీలకు అడ్డుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లో తన కుమారుడితో ఉంటున్న ఓ మహిళ గుండెలు బాదుకుంటూ పైసా.. పైసా కూడపెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నామని.. తమను రోడ్డున పడేశారంటూ రోదించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. మీకు ఇది తగునా అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఇక్కడే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న రవి అనేవ్యక్తి కిందపడి వెక్కివెక్కి ఏడ్చారు. సామాన్లు తీసుకుంటామన్నా వినకపోవడంతో కూలబడిపోయారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com