HYDRA Ameenpur : అమీన్‌పూర్‌లో సమగ్ర సర్వేకు హైడ్రా సిద్ధం

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చేందుకు హైడ్రా సమగ్ర సర్వేకు సిద్ధమైంది. కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు తమ ప్లాట్లను పక్కనే ఉన్న గోల్డెన్ కీ వెంచర్స్ ఆక్రమించారని వెంకటరమణ కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే నంబర్ 152, 153 పరిధిలోని వెంకటరమణ కాలనీలో హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు. ప్రాథమికంగా పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్లు, గోల్డెన్ కీ వెంచర్స్ కాలనీలోకి చొరబడి ఆక్రమణలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది.
ఈ విషయంపై మరింత లోతైన సర్వే నిర్వహించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే సంయుక్తాధ్వర్యంలో జాయింట్ సర్వే నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకటరమణ కాలనీతో పాటు చుట్టుపక్కల కాలనీల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే నిర్వహించాలని హైడ్రా నిర్ణయించింది. ఈ సర్వే పారదర్శకంగా ఉంటుందని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని హైడ్రా కమిషనర్ కోరారు.
హైడ్రా సర్వే పేరుతో చుట్టుపక్కల కాలనీవాసులను గోల్డెన్ కీ వెంచర్స్ నిర్వాహకులు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆక్రమణలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ బలి కావద్దని హైడ్రా హెచ్చరించింది. ఇప్పటికే పలు ఆరోపణల నేపథ్యంలో గోల్డెన్ కీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్, చక్రపురి కాలనీవాసులు కూడా తమ ప్రాంతాల్లో ఏమైనా కబ్జాలుంటే ఫిర్యాదు చేయాలని, ఈ సమగ్ర సర్వేలో వారిని కూడా భాగస్వాములను చేస్తామని హైడ్రా తెలిపింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని కాలనీవాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏమైనా ఫిర్యాదులుంటే హైడ్రా కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని హైడ్రా అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com