HYDRA: రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురాలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. రూ.110 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ప్రజావసరాలకు ఈ భూమిని వినియోగించాలని గతంలో ప్రభుత్వం భావించింది. అశోక్ సింగ్ అనే వ్యక్తి దీన్ని తన భూమిగా చెబుతున్నాడు. ఈక్రమంలో సిటీ సివిల్ కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ భూమిలో ఇప్పటికే రెండు సార్లు రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. అయినా అశోక్ సింగ్ స్థలాన్ని ఖాళీ చేయడంలేదు. మరోవైపు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడ్డాడు. అశోక్ సింగ్‌పై లంగర్‌హౌస్, మంగళ్‌హాట్, శాహినాయత్‌గంజ్ పోలీసు స్టేషన్లలో 8కి పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల భూములను పరిరక్షించింది.
సమగ్ర నివేదికను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రూపొందించారు. దీన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు పంపించారు. దీనిపై సమగ్ర సర్వేను నిర్వహించింది హైడ్రా. భూఆక్రమణ నిజమేనని తేలడంతో యాక్షన్ లోకి దిగింది. ఈ ఉదయం కూల్చివేత పనులు చేపట్టింది. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు పోలీసులు. భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ భూమి తనదేనంటూ కొన్ని నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు అశోక్ సింగ్. నాంపల్లి సిటీ సివిల్ కోర్టును సైతం ఆశ్రయించాడు. ఈ కేసు విషయంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అప్పట్లో కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు రెండుసార్లు భూమిని ఖాళీ చేయించారు కూడా. అయినప్పటికీ- అశోక్ సింగ్ మళ్లీ మళ్లీ భూమిని ఆక్రమించుకుని, దాని నుంచి అద్దె వసూలు చేస్తూ వచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com