HYDRA: నేటి నుంచే హైడ్రా వ్యాపార కేంద్రాల తనిఖీ

హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, అగ్నిప్రమాదాల నివారణే లక్ష్యంగా హైడ్రా (HYDRA) రంగంలోకి దిగింది. రద్దీ ప్రాంతాల్లో ఉన్న వాణిజ్య భవనాలు, వ్యాపార సముదాయాల్లో కఠిన తనిఖీలు చేపట్టేందుకు హైడ్రా సిద్ధమైంది. గురువారం నుంచి సంయుక్త తనిఖీలను ప్రారంభించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. అగ్ని భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను గుర్తించామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
నగరంలోని వ్యాపార సముదాయాలు, గృహోపకరణాల విక్రయ కేంద్రాలు, వస్త్ర దుకాణాలు, ఇతర వాణిజ్య భవనాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నదానిపై సంయుక్త తనిఖీలు నిర్వహించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. అగ్నిమాపక చర్యలు పాటించని భవనాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు వెంటనే విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని, లోపాలను స్పష్టంగా తెలియజేస్తూ భవనాల ముందు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తప్పించుకునే మార్గాలు లేకుండా ఉన్న దుకాణాలు, కాంప్లెక్సుల వివరాలను గుర్తించిన పక్షంలో ప్రజలు హైడ్రా కంట్రోల్ రూం చరవాణి సంఖ్య 90001 13667కు సమాచారం అందించాలని కమిషనర్ కోరారు. ఆయా భవనాల పేరు, ప్రాంతం, ఇతర వివరాలతో పాటు ఫొటోలు, వీడియోలను పంపించాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతోనే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలో గత ఏడాది మొత్తం 36 అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, సగటున నెలకు మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా వాణిజ్య భవనాల్లోనే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతోందని పేర్కొన్నారు. అగ్ని భద్రతపై నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.నాంపల్లిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాన్ని ప్రస్తావించిన కమిషనర్, అక్కడ ఫర్నీచర్ దుకాణం సెల్లార్‌లో భారీగా గృహోపకరణాలను నిల్వ ఉంచడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. సెల్లార్‌లో చిక్కుకున్న వారు బయటకు వచ్చే మార్గాలు లేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సెల్లార్లను దుర్వినియోగం చేయడమే ఈ విషాదానికి ప్రధాన కారణమని ఆయన స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
