HYDRA: రూ.1,500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

HYDRA: రూ.1,500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా
X
కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్న అధికారులు

హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్క్ స్థలాలపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ల ద్వారా రూ.1,500 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించారు. రక్షించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆస్తి అని స్పష్టంగా తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ ప్రాంతంలో ఉన్న జంగంకుంటను పూడ్చేసి అక్రమంగా చదును చేసి ప్లాట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు హైడ్రా అధికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రెవెన్యూ శాఖతో కలిసి సంయుక్త సర్వే నిర్వహించారు. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి పూర్తిగా ప్రభుత్వదేనని నిర్ధారించడంతో, కబ్జాదారుల ప్రయత్నాలకు బ్రేక్ వేశారు. దాదాపు రూ.700 కోట్ల విలువైన ఈ భూమిని కాపాడటంతో పాటు, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు.

అల్వాల్ మండలంలోని కొత్త చెరువు పరిధిలోనూహైడ్రా చర్యలు చేపట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్లు, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని కలుషితం చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. సుమారు ఎనిమిది ఎకరాల మేరకు విస్తరించిన ఆక్రమణలను తొలగించి చెరువు పరిధిని స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్క్ స్థలాన్ని, మౌలాలి సర్కిల్ పరిధిలోని రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి విముక్తం చేశారు. ఈ పార్క్ స్థలాలు గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ ద్వారా అప్పగించినవని అధికారులు గుర్తించారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీలు, రేకుల షెడ్లను తొలగించి, భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా హైడ్రా చర్యలు కొనసాగుతాయని, చెరువులు, పార్కులు, ఓపెన్ ల్యాండ్స్‌పై ఎలాంటి అక్రమాలకు తావు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నగరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి చర్యలు కీలకమని పౌరులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story