HYDRA: హైడ్రా దూకుడుతో అక్రమార్కుల పరుగులు

హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. మొన్నటి వరకు అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టిన హైడ్రా ఇప్పుడు కబ్జాకు గురైన భూములపై ఫోకస్ చేసింది. ఓవైపు చెరువుల పునరుద్ధరణ, మరోవైపు కబ్జాభూముల స్వాధీనంతో ప్రజలన ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా.. తాజాగా భాగ్యనగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు శుక్రవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. తెల్లవారుజాము నుంచే భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టింది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో సర్వే నంబర్ 403లో ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి వాటర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రభుత్వం గతంలో కేటాయించింది. అయితే, పార్థసారథి అనే వ్యక్తి ఈ మొత్తం ఐదెకరాల భూమి తనదేనంటూ అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రాలతో కోర్టును ఆశ్రయించాడు. వాస్తవానికి ఈ భూమి సర్వే నంబర్ 403 కాగా, అతను 403/52 అనే నకిలీ సర్వే నంబర్‌ను సృష్టించి మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఫెన్సింగ్, షెడ్లను పూర్తిగా కూల్చివేశారు.
వేటకుక్కలతో పహారా
1.20 ఎకరాలతోపాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెళ్లాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతోపాటు వేటకుక్కలను కాపలాగా పెట్టారు. కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకొని పహరా పెట్టారు. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను కూడా పార్థసారథి అడ్డుకున్నారు. ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న పార్థసారథి, కబ్జాకు గురైన భూమి గురించి హైడ్రాకు ఫిర్యాదు చేసిన జలమండలి, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కబ్జాదారులను పరుగులు పెట్టించింది. అక్కడ ఆక్రమణలు తొలగించి భూమిని అధికారులకు అప్పగించింది. ఫేక్ సర్వే నంబర్ (403/52)తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేసిన పార్థసారథిపై కేసులు పెట్టింది. పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్‌ను రెవెన్యూ, జలమండలితో పెట్టించింది. ఐదు ఎకరాల చుట్టూ కూడా ఫెంక్షన్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com