ap: నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో భారీగా వర్షం కురుస్తోంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ఇప్పటికే పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే 4 రోజులు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వెల్లడించారు. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఇవాళ కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. 17వ తేదీ వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీవర్షాలు, తీరం వెంబడి 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు.
ప్రభుత్వం అప్రమత్తం
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, తేలికపాటి వర్షాలు కురుస్తాయని సిసోదియా తెలిపారు. వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటుచేయాలని సిసోడియా సూచించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సిసోడియా సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com