Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కీలక పరిణామం.. రూ. 150 కోట్ల ఆస్తులు సీజ్..

Nayeem: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకొంది. 150 కోట్ల రూపాయల విలువైన 10 ఆస్తులను ఇన్‌కమ్ ట్యాక్స్ సీజ్ చేసింది. దీనిలో వ్యవసాయ భూములతోపాటు కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. అయితే, వీటి విలువ డాక్యుమెంట్ల ప్రకారం 12కోట్లు ఉన్నా.. మార్కెట్ విలువ 150 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ ఆస్తులను నయీం తన భార్య మహ్మద్ హసీనా బేగంతోపాటు మరికొందరు తన ఆప్తుల పేరిట రిజిస్టర్ చేసినట్టు పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తులను ఐటీ అధికారులు త్వరలోనే స్వాధీనం చేసుకుంటారని తెలిసింది. ఇక, ఆస్తుల సీజ్ విషయంపై నయీమ్ భార్య హసీనాకు నోటీసులు ఇచ్చారు ఐటీ శాఖ అధికారులు. గతంలోనూ నయీం బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.
ఈ విషయమై ఆమె ఆదాయ పన్ను శాఖ విచారణకు హాజరయ్యారు. బినామీ ఆస్తుల విషయం తనకేం తెలియదని హసీనా వివరించారు. 2016, ఆగస్టులో తెలంగాణ పోలీసులు నయీమ్‌ను ఎన్‌కౌంటర్ చేశారు. తర్వాత నయీమ్ బినామీ ఆస్తులు పెద్ద మొత్తంలో వెలుగులోకి వచ్చాయి.అతడి భార్యాపిల్లలు, బావమరిది, బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు.
ఇదే సమయంలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరకినట్టు కూడా వార్తలు వచ్చాయి. నయీమ్ గ్యాంగ్ నల్గొండతో పాటు పరిసర ప్రాంతాల్లో బినామీ ఆస్తులను సంపాదించింది. ఈఆస్తులను జప్తు చేయాలని గతంలోనే ఐటీశాఖ నిర్ణయించింది. మొత్తం 45 ఆస్తులు ఉన్నట్టు గుర్తించి.. అందులో పది ఆస్తులను ఇప్పుడు సీజ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com