INDIGO: ఎగరని ఇండిగో విమానాలు.. ఆగ్రహావేశాలు

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ముందస్తు సమాచారం లేకుండా విమాన సర్వీసుల్ని రద్దు చేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా శుక్రవారం ఒక్కరోజే 155 విమాన సర్వీసులను రద్దు చేయడంతో వేలమంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందులో శంషాబాద్ నుంచి వెళ్లాల్సినవి 84 ఉండగా.. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు రావాల్సినవి 71 ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్లైన్లో విమాన సర్వీసుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నట్లు చూపిస్తుండడం.. విమానాశ్రయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో ప్రయాణికులు ఆగ్రహోదగ్రులయ్యారు. ధర్నాకు కూడా దిగారు. చెకిన్ పూర్తయ్యాక సర్వీసులను రద్దుచేసినట్లు ప్రకటించడంతో ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇండిగో కౌంటర్ల వద్ద నగదు వెనక్కి తీసుకోవడానికి, రీషెడ్యూల్ చేసుకోవడానికి క్యూలైన్లలో పడిగాపులుపడ్డారు. తగినన్ని కుర్చీలు లేక కొందరు నేలపైనే కూర్చుండిపోయారు. అత్యవసరంగా వెళ్లాల్సినవారు ఇతర విమానయాన సంస్థల నుంచి టికెట్లు కొనేందుకు యత్నించగా... ధరలు ఆకాశాన్నంటాయి. హైదరాబాద్-కోచి విమానం నాలుగో రోజూ రద్దు కావడంతో శబరిమలై వెళ్లే భక్తులు శుక్రవారం తెల్లవారుజామున ఆందోళన చేపట్టారు.
శంషాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథికి తెలియజేయగా... ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఫోన్లో మాట్లాడి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు.
దిల్లీ-హైదరాబాద్‌కు రూ.33వేలు
శనివారం ప్రయాణానికి గానూ.. దిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎయిరిండియా టికెట్ కనీస ధర రూ.33వేలకు చేరింది. 7వ తేదీకి దిల్లీ-చెన్నై ఎకానమీ క్లాస్ కనీస టికెట్ ధర రూ.53వేలుగా, దిల్లీ-హైదరాబాద్ కనీస టికెట్ ధర రూ.25వేలుగా ఉంది. భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. రోజుకు దాదాపు 2,200 విమాన సర్వీసులను నడుపుతోంది. ఎయిరిండియాతో పోలిస్తే ఇది రెండింతలు. అలాంటి ఎయిర్‌లైన్ ఇప్పుడు సాంకేతిక సమస్యలు, సిబ్బందికి సంబంధించిన కొత్త రోస్టర్ నియమాలు తదితర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో శుక్రవారం దాదాపు 500 విమానాలను రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్, చెన్నై విమానాశ్రయాల్లో ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నిచోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇండిగో వ్యవహారంపై స్పందించిన కేంద్రమంత్రి
గత రెండు రోజులుగా రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయని, రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాల రద్దు వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోందని ఆయన అన్నారు. రద్దీ లేదా వేచి ఉండే పరిస్థితి ఉండదని ఆశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే మొదలు పెట్టగలిగే అన్ని కార్యకలాపాలను ప్రారంభించాలని ఇండిగోను ఆదేశించినట్లు తెలిపారు. సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని ఆయన వెల్లడించారు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలు, షెడ్యూలింగ్ నెట్ వర్క్‌ను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

