INDIRAMMA HOUSES: ఇందిరమ్మ ఇళ్ళకు నేడే శంకుస్థాపన

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నేడు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 72,045 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. నారాయణపేట జిల్లా పర్యటన సందర్భంగా వాటన్నింటికీ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. లబ్ధిదారులు స్వంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించనున్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. నారాయణపేటలోని అప్పక్కపల్లిలో లబ్దిదారుడి ఇంటికి రేవంత్ రెడ్డి ముగ్గు పోయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ఏడు పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు.
నియోజకవర్గానికి 3,500 ఇళ్లు
తెలంగాణ ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. గరిష్ఠంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్లను ఇవ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం తెలంగాణలో నాలుగు పథకాలకు దరఖాస్తులు తీసుకోగా... ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇదే:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం 11:30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ పోలేపల్లి ఎల్లమ్మను దర్శించుకుని పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12.25కి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.50కి నారాయణపేట జిల్లా కేంద్రమైన సింగారానికి వెళ్తారు. జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తారు. ఆ తర్వాత అప్పక్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా సీఎం స్వయంగా ముగ్గు పోస్తారు. మధ్యాహ్నం 1.30కి ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభిస్తారు. అలాగే మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత విద్యార్థులతో కాసేపు మాట్లాడతారు. మధ్యాహ్నం 2.10కి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com