తెలంగాణ

శరవేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు..!

సీఎం కేసీఆర్ సూచనల మేరకు అణువణువూ భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

శరవేగంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ  పనులు..!
X

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఆధ్యాత్మిక, ఆహ్లాద మేళవింపుతో కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ సూచనల మేరకు అణువణువూ భక్తిభావం ఉట్టిపడేలా వైటీడీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన శ్రీవారిమెట్లను కృష్ణరాతి శిలలతో నిర్మిస్తున్నారు. కొండకింద వైకుంఠద్వారం, శ్రీవారి పాదాల చెంత టెంకాయలు సమర్పించి మెట్లమార్గంలో కాలినడకన కొండపైకి చేరుకొని, హరిహరులను దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. కొండకింద వైకుంఠద్వారం చెంత సుమారు కోటీ 70 లక్షలతో పూర్తిగా ప్రాచీన నిర్మాణ శైలికి అనుగుణంగా ఐదంతస్థుల్లో కృష్ణరాతి శిల, డంగు సున్నం, ఇటుకలతో 55 అడుగుల గాలిగోపురాన్ని నిర్మించారు.

గాలిగోపురం నుంచి కొండపైన శివాలయం వరకు మెట్ల మార్గాన్ని పునర్నిర్మించేందుకు పాతమెట్లను పూర్తిగా తొలగించారు. నూతన మార్గం గుండా ఇప్పటికే సిమెంట్ కాంక్రీట్‌తో ఆర్సీసీ బెడ్ వేశారు. నడకదారిలో వెళ్లే భక్తుల ఆహ్లాదంకోసం కొండంతా పచ్చదనంతో నింపనున్నారు. మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకునేందుకు రెండు హాళ్లను నిర్మించనున్నారు. కొండపై వరకు ఆర్సీసీ బెడ్ నిర్మాణం పూర్తి కావడంతో కృష్ణశిలలు, డంగుసున్నంతో మెట్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు.

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన శ్రీవారి మెట్ల మార్గాన్ని 90లక్షల వ్యయంతో పూర్తిగా కృష్ణరాతి శిలలతో నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న తొలి మెట్టుకు స్తపతులు, అధికారుల ఆధ్వర్యంలో సంప్రదాయరీతిలో శిలన్యాసపూజలు నిర్వహించగా పనులు పురోగతిలో ఉన్నాయి. కొండకింద వైకుంఠద్వారం నుంచి కొండపైన శివాలయం వరకు సుమారు 365 మెట్లు రానున్నట్లు, ఒక్కో మెట్టు వెడల్పు 10 అడుగులు, పొడవు ఒక అడుగు ఉంటుందని వైటీడీఏ అధికారులు చెప్పారు.

యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి వారి మెట్ల మార్గం పునర్నిర్మించేందుకు మొత్తం. 3.5కోట్లు కేటాయించారు. ఈ నిధులతో కొండకింద వైకుంఠద్వారం నుంచి కొండపైన శివాలయం వరకు ఆర్సీసీ బెడ్, మెట్లకు ఇరువైపులా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. మెట్లదారిలో వెళ్లే భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్, విశ్రాంతి గదులను నిర్మించనున్నారు. మార్గమధ్యంలో భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా అవసరమైన ప్రాంతాల్లో గ్రీనరీ, ప్లాంటేషన్, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్లను వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తుండటంతో యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.

Next Story

RELATED STORIES