తెలంగాణ

Inter Results: ఇంటర్‌లో 51 శాతం మంది ఫెయిల్.. పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహ్యత్యాయత్నాలు..

Inter Results: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు.. విద్యార్థుల పాలిట మరణశాసనంలా మారాయి.

Inter Results: ఇంటర్‌లో 51 శాతం మంది ఫెయిల్.. పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహ్యత్యాయత్నాలు..
X

Inter Results: తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు.. విద్యార్థుల పాలిట మరణశాసనంలా మారాయి. ఇంటర్‌ బోర్డ్‌ నిర్లక్ష్యంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తున్నారు. వరుస ఆత్మహత్యలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కరోనా పరిస్థితులు, పరీక్షలు జరుగుతాయా లేదా.? అన్న సందిగ్ధం మధ్య ఈసారి పరీక్షలు జరిగాయి.

సరిగా క్లాస్‌లు జరిగింది లేదు.. ప్రాక్టికల్స్‌ కూడా ప్రాపర్‌గా జరగలేదు. దీంతో టెన్త్‌ మాదిరిగానే ఇంటర్‌ విద్యార్థులనూ ప్రమోట్‌ చేస్తారని విద్యార్థులు భావించారు. పరీక్షలకు ముందు అధికారులు, పాలకులు అదే విధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తీరా ఆఖరి నిమిషానికి వచ్చేసరికి పరీక్షలు రాయాల్సిందే అన్నారు. దీంతో సరిగా ప్రిపేర్‌ కాలేకపోయిన విద్యార్థులు.. ఆటంకాల మధ్యే పరీక్షలు రాశారు.

ప్రోత్సహించే లాగానే ఫలితాలు వస్తాయని భావించారు. కానీ విద్యార్థుల గుండెల్ని పిండేసేలా ఇంటర్‌ బోర్డ్‌ ఫలితాలు ఇచ్చింది. ఏకంగా 51శాతం మంది విద్యార్థులను ఫెయిల్‌ చేసింది. ఇప్పుడు ఇదే విద్యార్థులకు గుండెకోతను మిగులుస్తోంది. ఫలితాలను తట్టుకోలేకపోతున్న విద్యార్థులు.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అర్థాంతరంగా జీవితాలను ముగించేస్తున్నారు.

ఇంటర్‌ విద్యార్థులు.. నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్‌.. ఫలితాలపై మనస్థాపంతో ప్రాణాలు తీసుకున్నారు. చదువులో ఎప్పుడూ ముందుండే జాహ్నవి.. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది. బాగా రాసినా తనను ఫెయిల్‌ చేశారని.. తీవ్ర మనోవేధనకు గురైన విద్యార్థిని.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇవి మచ్చుకు వెలుగులోకి వచ్చిన ఒకటి రెండు విషయాలు మాత్రమే. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు.. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. గణేశ్‌ రూపానీ లాంటి విద్యార్థులు.. మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ట్వీట్‌ చేశారు. కేవలం తెలుగు, ఇంగ్లీష్‌ సబ్జెక్ట్స్‌లో మాత్రమే తనను పాస్‌ చేసి.. నాలుగు సబ్జెక్ట్స్‌లో ఫెయిల్‌ చేశారని మార్క్స్‌ లిస్ట్‌ను ట్యాగ్‌ చేశాడు.

ఇంటర్‌ ఫలితాలపై మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుండంపై విద్యార్థి సంఘాలు రగిలిపోతున్నాయి. కరోనా సమయంలో పరీక్షలు వద్దని చెప్పినా వినకుండా హడావుడిగా పరీక్షలు పెట్టి.. విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేశారని.. ఎన్‌ఎస్‌యూఐ మండిపడుతోంది. కనీస మార్కులు వేసి విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని.. రీవాల్యుషన్‌ అవకాశమూ కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది.

అటు అఖిల భారత విద్యార్థి సమాఖ్య.. దీనిపై ఆందోళనబాట పట్టింది. బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించింది. విద్యార్థులకు మళ్లీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని.. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది.

Next Story

RELATED STORIES